మొక్క జొన్న -  పురుగులు

  1. కాండం తొలిచే ఈగ Scientific Name  : Antherigona orientalis

ప్రధానంగా దక్షిణ భారత దేశంలో మొక్క జొన్న పంటను ఆశించే పురుగు ఇది. వేసవి, చలి కాలంలో ఉత్తర భారత దేశంలో కూడా పంటను ఆశిస్తుంది. ఎక్కువగా మొలక దశలో పంటను నాశనం చేస్తుంది.   మార్చి – డిసెంబర్ మధ్య కాలంలో వస్తుంది.   మొక్క జొన్నతో పాటు జొన్న, చిరు  ధాన్యాలు, గడ్డి జాతి మొక్కలను కూడా ఆశిస్తుంది.    

లక్షణాలు
కొద్దిగా పెరిగిన లార్వా మెల్ల మెల్లగా ఆకు పై భాగం లోకి వచ్చి, అంచుల నుంచి కిందికి జారుతూ,  ఆకులో ఎదిగే భాగాన్ని చేరుతుంది. దాన్ని తొలచడం వల్ల ఆకు మధ్య భాగం  ఎండిపోతుంది. ఆ భాగంలోని పదార్థాన్ని  తినడం వల్ల ఆకు వడలి పోతుంది. పురుగు సోకిన 2-౩ రోజుల పాటు ఈ లక్షణాలు కనపడతాయి. ఒక్కోసారి ఎదిగే భాగం దెబ్బ తిన్నప్పుడు, పక్క నుంచి కొత్త మొలకలు వస్తాయి. అప్పుడు మొక్క తిరిగి ఎదుగుతుంది. కొన్ని రకాల వంగడాలలో ఇలాంటి నిరోధక శక్తి అంతర్గతంగా ఉంటుంది. ౩5 నుంచి 40 సెంటి మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలలో వడలిన లక్షణాలు కనపడవు. ఇలాంటి మొక్కలలో ఆకుల అంచులు దెబ్బ తిన్నట్టు కనపడతాయి.  5 నుంచి ౩0 రోజుల వయస్సు ఉన్న మొక్కలకు ఈ పురుగు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ౩0 రోజులకు మించి వయస్సు ఉన్న మొక్కలలో ఈ పురుగు సోకే అవకాశాలు తక్కువ.

అయితే వాన కాలంలో, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ పురుగు ఎక్కువగా సోకుతుంది. కానీ అప్పుడు వడలిన లక్షణాలు కనపడవు.   పురుగు వల్ల దెబ్బ తిన్న ఆకులు సన్నగా, కాగితం మాదిరిగా మారతాయి.  పక్క నున్న ఆకులను చుట్టుకుని పోతాయి. దానివల్ల ఇతర ఆకులు కూడా పెరగకుండా పోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు
పురుగు జీవిత చక్రం
పురుగు మొత్తం జీవిత కాలం 17-21 రోజుల పాటు ఉంటుంది
గుడ్లు దశ:
లేత  దశలో ఉన్న మొక్క ఆకుల కింది భాగపు అంచులలో తల్లి పురుగు గుడ్లు పెడుతుంది. మామూలుగా మొలకెత్తిన 5-౩0 రోజులలో ఇది జరుగుతుంది. గుడ్లు  తెల్లగా, సన్నగా పొడవుగా, సిగరెట్ మాదిరిగా ఉంటాయి. 4-6  గంటలలో పొదగబడతాయి. 
పిల్ల పురుగు (లార్వా) దశ:
గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకు కింది భాగపు ఉపరితలం మీద నుంచి మెల్ల మెల్లగా లేత మొక్క అడుగు భాగానికి చేరతాయి. పెరిగే భాగాలను, ప్రధానమైన కొమ్మ భాగాలను నాశనం చేస్తాయి. చివరకు మొక్క ఎదగకుండా చేస్తాయి. ఈ దశలో 8.-.10 రోజుల పాటు గడుపుతుంది.
కోశాస్థ (ప్యుపా)  దశ:
దక్షిణ భారత దేశంలో ఈ దశ 8 రోజుల పాటు ఉంటుంది.  అదే ఉత్తర భారత దేశంలో 14 రోజుల పాటు ఉంటుంది. ఎక్కువగా కాండం అడుగు భాగంలో ఈ దశను గడుపుతుంది. అప్పుడప్పుడు నేలలో కూడా గడుపుతుంది. ఈ దశలో 8.-.10 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు:
పెద్దగా మారిన రెక్కల పురుగు ఎక్కువగా ఉదయం 7 గంటలనుంచి 10 గంటల మధ్య వస్తుంది. ఆడ పురుగు 7 రోజులు బతుకుతుంది. మగ పురుగు 17 రోజుల వరకు జీవిస్తుంది. రెక్కల పురుగులు రోజంతా చురుకుగా ఉంటాయి. ఒక తల్లి పురుగు తన జీవిత కాలంలో 240 గుడ్లు పెడుతుంది.

పురుగును గుర్తించడం
గుడ్లు దశ:

7-8 రోజుల లేత దశలో ఉన్న మొక్క ఆకుల కింది భాగపు అంచులలో గుడ్లు ఉంటాయి. మామూలుగా ఒక్కో ఆకు కింద ఒకటి నుంచి మూడు గుడ్లు కనపడతాయి. గుడ్లు  తెల్లగా, సన్నగా, సిగరెట్ మాదిరిగా ఉంటాయి.  0.2 – 0.8. మిల్లి మీటర్ల పొడవు ఉంటాయి.  -6  గంటలలో పొదగబడతాయి. 
పిల్ల పురుగు (లార్వా) దశ:
గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకు కింది భాగపు ఉపరితలం మీద నుంచి మెల్ల మెల్లగా లేత మొక్క అడుగు భాగానికి చేరతాయి. పెరిగే భాగాలను, ప్రధానమైన కొమ్మ భాగాలను, లేత మొక్కలను  నాశనం చేస్తాయి. చివరకు మొక్క ఎదగకుండా చేస్తాయి. పురుగు సోకిన మొక్క ఆకు గోధుమ రంగులోకి మారి వడలినట్లు కనపడుతుంది.  పూర్తిగా ఎదిగిన లార్వా 8 – 10 మిల్లి మీటర్ల పొడవు  ఉంటుంది. తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.  ఈ దశలో 8-10 రోజుల పాటు గడుపుతుంది.
కోశాస్థ (ప్యుపా)  దశ:
ఎక్కువగా కాండం అడుగు భాగంలో ఈ దశను గడుపుతుంది. అప్పుడప్పుడు నేలలో కూడా గడుపుతుంది. ఈ దశలో 8-10 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు:
రెక్కల పురుగు  4 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. ఇండ్లలో తిరిగే చిన్న  ఈగ మాదిరిగా ఉంటుంది. ఆడ పురుగు తల, గొంతు భాగం బూడిద రంగులో ఉంటుంది. కడుపు భాగం పసుపు రంగులో ఉండి, దానిపై జతలుగా గోధుమ రంగు మచ్చలు కనపడతాయి. మగ పురుగు ఎక్కువగా  నల్లగా ఉంటుంది.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • విత్తన శుద్ధి  (కిలో విత్తనాలకి 10 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యు.ఎస్. తొ)
  • పురుగు మందులతో శుద్ధి చేసిన విత్తనాలను వాడడం
  • ఈ కింది వాటిలో ఏదైనా చల్లడం
    • హెక్టారుకు 500 మిల్లి లీటర్ల మీథైల్ డిమాటోన్ 25 ఇ.సి.
    • హెక్టారుకు 500 మిల్లి లీటర్ల డై మీథోఏట్  25 ఇ.సి.
    • వేప గింజల కషాయం (5%)
    • వేప ద్రావణం (1%)
  • జీవ పద్దతులు
  • సకాలంలో నాటడం – (ఫిబ్రవరి తొలి వారం లోగా)
  • పంట అవశేషాల తొలగింపు
  • ఫిష్ మీల్  ట్రాప్ లను వాడటం – (హెక్టారుకు 12) 
  • పంటల మార్పిడి
  • పొలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం

అనుకూల వాతావరణం
వాన కాలంలో, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ పురుగు ఎక్కువగా సోకుతుంది. కానీ అప్పుడు వడలిన లక్షణాలు కనపడవు.

 
  1. కాండం తొలుచు పురుగు Scientific Name  : Chilo pertellus

మొక్కజొన్నను ఆశించే పురుగులలో ఇది ప్రధానమైన పురుగు. దేశంలోని అన్ని ప్రాంతాలలోను  ఇది ఆశిస్తుంది. వానా కాలంలో ఎక్కువగా వస్తుంది. ఏడాదిలో రెండు జీవిత చక్రాలను పూర్తి చేసుకుంటుంది. ప్రాంతం, పంటల సంఖ్య, ఆశించడానికి అనువుగా ఉన్న ఇతర పంటలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.   జూన్ – అక్టోబర్ మధ్య కాలంలో వస్తుంది.   మొక్క జొన్నతో పాటు జొన్న, చిరు  ధాన్యాలు, గడ్డి జాతి మొక్కలను ఆశిస్తుంది.    

గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు లేత మొక్క ఆకులని తింటూ, మెల్లగా కాండం లోకి చొచ్చుకు పోతుంది. పిల్ల పురుగు వల్ల దెబ్బ తిన్న లేత ఆకులపై చిన్న చిన్న  రంద్రాలు కనపడతాయి.  పురుగులు పెద్దవైన కొద్దీ ఈ రంధ్రాలు పెద్దవి అవుతాయి. పురుగు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మొక్కలో మధ్యలో ఉండే లేత భాగాలు ఎండి పోతాయి. ఈ స్థాయిలో దెబ్బతిన్న  మొక్కల ఆకులపై దెబ్బ తిన్న గుర్తులేమి కనపడవు. కానీ మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. పూత రాకుండా ఉంటుంది. పిల్ల పురుగులు లేత కాయలను, పిందెలను కూడా పాడుచేస్తాయి. మొక్క జొన్న పంటను బాగా దెబ్బే తీసే పురుగు ఇది. పురుగు సోకినప్పుడు ఒక్కోసారి పంట నష్టం 70 – 75 శాతం వరకు ఉంటుంది. 
పురుగు సోకిన మొక్క కాండం వడలి ఎండిపోయినట్టు ఉంటుంది. కాండం తొలుచుకుని వెళ్ళిన పిల్ల పురుగు కాండం లోపలి భాగాలను తినేస్తుంది. పురుగు చేసిన రంద్రాలు కాండం కణుపుల దగ్గర స్పష్టంగా కనపడతాయి. చిన్న లార్వాలు ఆకుల పై భాగాన్ని తినేయడం వల్ల ఆకులపై కూడా రంద్రాలు ఏర్పడతాయి. పురుగు సోకిన కాండంలో తొలిచిన భాగాలలో పురుగు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

మొక్క మొలకెత్తిన 10-25 రోజుల లోపుల, ఆకుల కింది భాగంలో తల్లి పురుగు  గుడ్లు పెడుతుంది. ఉష్ణోగ్రతను బట్టి వారం, 10 రోజుల లోపుల ఇవి పొదగబడతాయి.  
పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకుల పైకి ఎగబాకి ఆకుల ముడతలలోనికి చొచ్చుకుపోతాయి.  ఈ ముదతలలోనే ఆకు ఉపరితలాన్ని తింటూ బతుకుతుంది. ఎదిగే క్రమంలో ఇవి మెల్ల మెల్లగా లేత కాండం మధ్య భాగం లోకి, చివరకు కాండంలోకి చొచ్చుకుపోతాయి. పైకి, కిందకు తిరుగుతూ కణుపుల దగ్గర కాండంలోకి చొచ్చుకుపోతాయి. మొత్తంగా 28-౩5 రోజుల లోపల పిల్ల పురుగు జీవిత చక్రం పూర్తీ చేసుకుంటుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశలో 8-1- రోజుల పాటు గడుపుతుంది.
తల్లి పురుగు
గుడ్లు పెట్టడానికి  మొక్కలోని వంపులు, ముడతలు వంటి స్థలాలను చూసుకుంటుంది.  

పురుగును గుర్తించడం

గుడ్డు దశ :
గుడ్లు  గుండ్రంగా, గుంపులుగా, ఒత్తబడినట్టు    ఉంటాయి.  తల్లి పురుగు 100 నుంచి 160 గుడ్లు పెడుతుంది. ఆకుల కింద భాగంలో ఇవి కనపడతాయి. అప్పుడప్పుడు కాండం మధ్య భాగంలో కూడా కనపడతాయి

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు ముదురు గులాబి రంగులో ఉంటాయి. వెనుక భాగంలో గుంపులు గుంపులుగా నల్లటి మచ్చలు కనపడతాయి. తల భాగం గోధుమ రంగులో ఉంటుంది. పూర్తిగా పెరిగిన పిల్ల పురుగులు 25 మిల్లి  మీటర్ల పొడవు ఉంటాయి.

కోశాస్థ (ప్యుపా) దశ:
కాండం లోని  చిన్న రంధ్రంలో ఈ దశను గడుపుతుంది. ఈ దశలో -1- రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు
రెక్కల పురుగు 20-౩0  మిల్లి  మీటర్ల రెక్కల నిడివి కలిగి ఉంటుంది. ఆడ పురుగుల కంటే మగ పురుగులు చిన్నగా, ఒకింత నల్లగా ఉంటాయి.  మగ పురుగు ముందు రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఆడ పురుగు ముందు రెక్కలు ఇంకా లేత రంగులో ఉంటాయి. వెనుక రెక్కలు దాదాపు తెలుపు రంగులో ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • మొలకెత్తిన 10 రోజుల  తరువాత 750 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్ (0.1&)ని 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయడం
  • మొలకెత్తిన 10 – 12 రోజుల  తరువాత, లీటరు నీటికి ఒకటి లేదా ఒకటిన్నర మిల్లి లీటర్ల క్లోరో ఫైరోఫాస్ కలిపి చల్లడం
  • ఈ కింది పురుగు మందులలో దేనినైనా ఒకదాన్ని ఇసుకతో కలిపి చల్లడం (50 కిలోలు)
    • 8 కిలోల ఫోరేట్ 10 జి.బి., 17 కిలోల కార్బో ఫ్యురాన్  ౩జి, కార్బారిల్ + 20 కిలోల లిండెన్
    • కిలో కార్బారిల్ 50 డబ్ల్యు పి (500 లీటర్ల నీటికి కలిపి చల్లడం)
  • జీవ పద్దతులు
  • అంతర పంటగా  బొబ్బర్లు (4:1 వరుసల నిష్పత్తిలో)
  • దీపపు ఎరలు  (రెక్కల పురుగుల్ని ఆకర్షించడానికి)
  • పంట అవశేషాలను కాల్చి వేయడం
  • మొలకెత్తిన 10 రోజుల  తరువాత, హెక్టారుకు 8 ట్రైకో కార్డులను వదలడం (ట్రైకో గామా చిలోనిస్)
  • మిత్ర పురుగులు (ట్రైకో గామా ఎస్ పి పి గుడ్లని చంపివేస్తుంది. పిల్ల పురుగులను అఫాంటేలేస్ ఫెవిపెస్, ట్రైకో గామా చిలోనిస్ అదుపు చేస్తాయి.)
 

౩. గులాబి రంగు కాండం తొలిచే పురుగు Scientific Name  : Sesamia inferens

ఎక్కువగా  చలి కాలంలో మధ్య భారత దేశంలో మొక్కజొన్న పంటను ఆశించే పురుగు ఇది.  అక్టోబర్ – ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తుంది.   మొక్క జొన్నతో పాటు గోధుమ, వరి, జొన్న, రాగి, బార్లి, చెరుకు, సజ్జ, ఇతర గడ్డి జాతి పంటలను ఆశిస్తుంది

లక్షణాలు
గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల కింది భాగంలో ఉండి, కాండాన్ని తొలుచుకుని తింటూ ఉంటాయి. ఆకుల కింది భాగంలోని పదార్థాన్ని కూడా తినేస్తాయి.  కొంచెం పెరిగిన తరువాత, కొన్ని పిల్ల పురుగులు పక్కనున్న మొక్కల  ఆకులని ఆశ్రయిస్తాయి. మరికొన్ని పిల్ల పురుగులు అదే మొక్క కాండాన్ని తొలుచుకుని లోపలికి పోతాయి.
ఆకుల మీద గుండ్రంగా కాకుండా, రకరకాల ఆకారాలలో రంధ్రాలు ఏర్పడతాయి. పిల్ల పురుగులు మొక్క ప్రధాన భాగంలోనికి వెళ్ళినప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడప్పుడు కాండం కింది కణుపుల దగ్గర వలయాకారపు చిల్లులు కనపడతాయి.  పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే, ఒక్కోసారి కాండం విరిగిపోతుంది. 

మొక్కలో  పాడయ్యే భాగాలు

కాండం, ఆకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

రెండు నుంచి మూడు వారాల వయస్సు ఉన్న లేత మొక్క కింది ఆకుల పొరలలో తల్లి పురుగు గుడ్లు  పెడుతుంది. 2 – ౩ వరుసలలో 80 నుంచి ౩౦౦ గుడ్ల వరకు ఉంటాయి. పొదగడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ గుడ్లు గోధుమ లేదా ముదురు బూడిద రంగులోకి మారతాయి. వారం లోపల గుడ్ల నుంచి పిల్లలు బయటికి వస్తాయి.

గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మొక్క అడుగు భాగానికి చేరి అక్కడ కాండాన్ని పాడు చేస్తాయి. కాండం లోపలికి తొలుచుకి వెళ్లి, దాన్ని గుల్లగా మార్చేస్తాయి.  25- ౩5 రోజుల లోపుల పెరుగుతాయి. ఈ లోపే చాలా మొలకలను పాడు చేస్తాయి.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ కాండం లోపలే గడుపుతుంది. ఒక్కోసారి బయట కూడా అంటే ఆకుల పొరలలో లేదా కాండంలోని ఇతర కనపడని  భాగాలలో కూడా ఉంటుంది.

రెక్కల పురుగు
రెక్కల పురుగు ఎక్కువగా రాత్రి పూట తిరుగుతుంది.  ఆకుల క్రింది భాగాలలో గుడ్లు పెడుతుంది.

పురుగును గుర్తించడం

   గుడ్డు దశ :
గుడ్ల పసుపు రంగులో ఉంటాయి. ఆకుల కింది భాగపు ఉపరితలంలో ఒకటి నుంచి మూడు వరుసలలో ముత్యపు రాళ్ళ మాదిరి కనపడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గులాబీ లేదా ముదురు గులాబీ రంగులో ఉంటాయి. పురుగు పక్క భాగాలు దళసరిగా, నునుపుగా ఉంటాయి. శరీరం గుండ్రంగా, తల ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది.  మొత్తంగా 25 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
పైన గూడు వంటిది ఏమి ఉండదు.  18 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.  ముదురు గోధుమ రంగు శరీరంతో తల దగ్గర ఎరుపు నీలం కలిసిన రీతిలో వంకాయ రంగు మచ్చని కలిగి ఉంటుంది. 
రెక్కల పురుగు
రెక్కల పురుగులు లావుగా ఉండి, వేగంగా తిరుగుతూ ఉంటాయి. ౩.5 సెంటి మీటర్ల రెక్కల నిడివి ఉంటుంది. రెక్కలు గడ్డి మాదిరిగా ఉండి, పైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. ముందు రెక్కల మీద మధ్యలో ముదురు గోధుమ చార  ఉంటుంది.  వెనుక రెక్కల మీద ఎలాంటి మచ్చలు ఉండవు. మబ్బు పట్టిన తెలుపు రంగులో ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • విత్తన శుద్ధి (కిలో విత్తనాలకు 2.5 గ్రాముల కార్బోఫ్యురాన్ 40 ఎఫ్ కలిపి శుద్ధి చేయాలి)
    • ప్రతి 20 రోజులకు ఒకసారి, ఫోసాలోనేబ్ ౩5% ఇ.సి. మందును  చల్లాలి.
    • విత్తనం మొలకెత్తిన 10 రోజుల తరువాత 250 లీటర్ల నీటిలో 700 మిల్లి లీటర్ల ఎండోసల్ఫాన్ (౩5 ఇ.సి. - (0.1%) మందును కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
  • పంట అవశేషాలను, పురుగు సోకిన భాగాలను కాల్చివేయడం
  • అంతర పంటలు  (మొక్క జొన్న, సోయా బీన్, ఇతర పప్పు ధాన్యపు పంటలు)
  • రోగ నిరోధక వంగడాలని వాడడం
  • పరాన్న జీవులతో  జీవ నియంత్రణ (ట్రైకో గామా)
  • సహజ శత్రువులను ప్రోత్సహించడం    
 
  • కాయ తొలుచు పురుగు Scientific Name  :  Helicoverpa armigera

పత్తి, పప్పు ధాన్యపు పంటలు, మొక్క జొన్న, టమాట, వేరు శనగ  పంటలను ఆశిస్తుంది.  

లక్షణాలు
పిల్ల పురుగులు గింజలను, సిల్క్ ను తినేస్తాయి.  సిల్క్ మీద ఉన్న గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పిందెలలోకి పోయి గింజలని తినేస్తాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
పిందెలు, గింజలు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

ఆయా మొక్కల  ఉపరితల భాగాలలో తల్లి పురుగు గుడ్లు పెడుతుంది.  ఒక తల్లి పురుగు దాదాపు 500 గుడ్ల వరకు పెడుతుంది. 4-5 రోజులలో ఇవి పొదగబడతాయి. గుడ్లు గుండ్రని ఆకారంలో, తెలుపు నుంచి  ఆకుపచ్చ రంగులో కనపడతాయి. మైక్రో స్కోప్లో చూస్తే, గుడ్లకు అంచులు కూడా కనపడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి 4-5 రోజులలో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. సీజన్, ఆహార లభ్యత బట్టి ఈ  పిల్ల పురుగులు  14 నుంచి 20 రోజుల పాటు బతుకుతాయి. ఈ కాలంలో 6 రకాలుగా రూపాంతరం చెందుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
మొక్క అడుగు భాగంలోకానీ, అక్కడ ఉన్న చెత్తలో కానీ,  లేదా నేలలో కానీ ఈ దశను గడుపుతుంది.  మొత్తంగా 10 నుంచి 15 రోజుల పాటు ఈ దశలో  ఉంటుంది.
తల్లి పురుగు
ఈ దశలో పురుగు ఆహారం తినదు. 6 నుంచి 8 రోజుల పాటు బతుకుతుంది. మగ పురుగుతో కలిసిన తరువాత ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. 

పురుగును గుర్తించడం
గుడ్డు దశ :

గుడ్లు గుండ్రంగా ఉంటాయి. ముదురు తెలుపు రంగులో ఉంటాయి. విడివిడిగానే ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు ఆకు పచ్చ నుంచి గోధుమ రంగులో ఉంటాయి. శరీరం మీద ముదురు గోధుమ చారలతొ పాటు నిలువుగా తెల్లని గీతలి ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశలో గోధుమ రంగులో కనపడుతుంది. నేలలో కానీ, ఆకుల మధ్య కానీ, మొగ్గలలో కానీ , కింద ఉన్న  పంట చెత్తలో కానీ ఉంటుంది.

రెక్కల పురుగు:  
రెక్కల పురుగు లేత గోధుమ, పసుపు రంగులో ఉంటుంది. చూడడానికి లావుగా కనపదుతుంది. ముందు రెక్కలు  ఆలివ్ గ్రీన్ కలర్ లేదా  లేత గోధుమ రంగులో  ఉంటాయి. మధ్యలో గుండ్రటి ముదురు గోధుమ రంగు మచ్చ ఉంటుంది. వెనుక రెక్కలు లేతటి,  పొగబట్టిన తెలుపు వంటి రంగులో ఉంటాయి.  వాటి అంచులు వెడల్పాటి  నల్లటి అంచులని కలిగి ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

పిలకలు వచ్చిన తరువాత,  ౩వ రోజు, తిరిగి 18వ  రోజుల లోపు ఈ కింద తెలిపిన వాటిలో దేనినైనా ఒకదాన్ని చల్లాలి.

    • హెక్టారుకు 25 కిలోల అర్బారిల్ 10 డి
    • హెక్టారుకు 25 కిలోల మాలాథియాన్  డి
    • హెక్టారుకు 25 కిలోల ఫోసాలోన్ 4 డి
  • జీవపద్దతులు
    • దీపపు ఎరలు పెట్టడం
    • లింగాకర్షక బుట్టలు పెట్టడం (హెక్టారుకు 12)
    • 10 రోజుల నిడివితో, రెండు సార్లు ఎన్.పి.వి. ద్రావణం చల్లడం ( 1.5 X1012 POB  లెక్కన, 2.5. కిలోల ముడి చక్కెర,, 250 గ్రాముల పత్తి గింజల కషాయం కలిపి చల్లడం 
     

    5.   బూడిద పురుగు Scientific Name  :  Myllocerus sps

    లక్షణాలు
    పిల్ల పురుగులు వేర్లను తింటూ బతుకుతాయి. పెద్దవిగా మారిన రెక్కల పురుగులు ఆకులని తింటాయి. దానివల్ల ఆకులు, వేర్లు పాడవుతాయి.

    మొక్కలో  పాడయ్యే భాగాలు
    ఆకులు, వేర్ల

    పురుగు జీవిత చక్రం
    గుడ్డు దశ :  

    గుడ్లు ౩ నుంచి 11 రోజులలో పొదగబడతాయి.  
    పిల్ల పురుగు (లార్వా) దశ :
    పిల్ల పురుగులు ౩ నుంచి 42 రోజుల పాటు బతుకుతాయి.  మట్టిలో బతుకుతూ,  మొక్క వేర్లని ఆదారం చేసుకుని బతుకుతాయి.
    కోశాస్థ (ప్యుపా) దశ:
    కోశస్థ దశ 5 నుంచి 7 రోజుల పాటు ఉంటుంది. మట్టిలో బతుకుతుంది.
    రెక్కల పురుగు
    ఆకుల  అంచులను తింటూ బతుకుతుంది. అంచుల వెంబడి ‘U’ ఆకారంలో కొరికి తింటుంది.

    పురుగును గుర్తించడం          

    గుడ్డు దశ :
    గుడ్లు  లేత పసుపు రంగులో ఉంటాయి. నెలలో మట్టి లోపల  ఉంటాయి.
    పిల్ల పురుగు (లార్వా) దశ :
    పిల్ల పురుగులు లావుగానూ, పసుపు రంగులోను ఉంటాయి. పొడవు 7 నుంచి 9 మిల్లి మీటర్ల వరకు ఉంటుంది. 

    పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

    • రసాయన పద్దతులు

    పురుగు సోకినప్పుడు, హెక్టారు పంటలో లీటర్ క్వినాల్ఫాస్ 25 ఇ.సి. లేదా కిలో కార్బారిల్   50 డబ్ల్యు పై చల్లాలి.

    • జీవ పద్దతులు
 

6.   ఆకు ముడత పురుగు Scientific Name  : Pyrilla perpusilla

మొక్క జొన్న, చిరు ధాన్యాలు, వరి, బార్లి,  ఓట్స్, జొన్న, సజ్జ, ఇతర గడ్డి జాతి పంటలను ఆశిస్తుంది.

లక్షణాలు
ఆకుల కింది భాగంలో ఉండి, వాటి రసాన్ని పీలుస్తాయి. దానితో ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోయినట్టు కనపడతాయి.  పురుగు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఆకుల మీద పసుపు మచ్చలు కనపడతాయి. పురుగులు తియ్యటి తేనే లాంటి పదార్థాన్ని ఆకుల మీద  స్రవిస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకుల మీద నల్లటి ఫంగస్ లాంటిది ఏర్పడుతుంది. ఈ ఫంగస్ తొ పాటు, ఆకులమీద పత్ర హరితం   లేకపోవడం వల్ల  కిరణ  జన్య సంయోగ క్రియ నిలిచిపోతుంది,. దానితో ఆకులు ఎండిపోతాయి.
మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

వేడి పరిస్థితులని బట్టి గుడ్లు 6 నుంచి 15 రోజుల లోపుల పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు మొత్తం 5 రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఎదగడానికి 40 నుంచి 60 రోజులు పడుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
రెక్కల పురుగు
రెక్కల పురుగులు చాలా చురుకుగా కదలాడుతూ, ఒక పంట నుంచి ఇంకో పంట మీదకు పోతూ ఉంటాయి.  ఏడాది పొడవునా సంతానోత్పత్తి జరుపుతూ ఉంటాయి.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ :

గుడ్లు లేత పసుపు రంగులో గుండ్రంగా ఉంటాయి.  ఆకుల కింది భాగంలో మధ్య ఈనెల దగ్గర కనపడతాయి. ఒక మిల్లి మీటర్  మేర పొడవు ఉంటాయి. ఒక్కో దగ్గర 20 గుడ్ల వరకు కనపడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు తొలిదశలో ఆకుపచ్చగా ఉంటాయి. రానురాను లేత గోధుమ రంగుకి మారతాయి. రెక్కలుండవు.  శరీరామ్ చివరన రెండు పోగులవంటివి  ఉండి, మైనపు పదార్థం వంటి ఈకలతో కప్పబడి ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:

ఈ దశ ఉండదు.

రెక్కల పురుగు
రెక్కల పురుగులు గడ్డి లేదా గోధుమ రంగులో ఉంటాయి. 7 నుంచి 8 మిల్లిమీటర్ల పొడవు ఉంటాయి. ముందు భాగంలో మొనదేరినటువంటి ముక్కు, నోరు భాగాలు ఉన్నట్టు కనపడుతుంది. కలసిపోయి ఉన్నట్టే కనపడుతాయి కాని కొంచెం అలికిడికి ఎగిరిపోతాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

రసాయన పద్దతులు

150వ రోజు, తిరిగి 210వ  రోజు ఈ కింద తెలిపిన వాటిలో దేనినైనా ఒకదాన్ని చల్లాలి.

    • మాలాథియాన్  50 ఇ.సి. 2000 మిల్లి లీటర్లు 
    • మొనోక్రోటోఫాస్ ౩6 డబ్ల్యు.ఎస్.సి. 2000 మిల్లి లీటర్లు 
    • 0.౦5 %  పారాథియాన్ లేదా  థయోడిన్ లేదా ఫెనిత్రోతియాన్ లేదా రోగోర్   
    • ఆల్డ్రిన్ లేదా డైల్ద్రిన్ 10%
  • జీవ పద్దతులు
    • నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించడం
    • దీపపు ఎరలు పెట్టడం
    • పరాన్న జీవులు  వదలడం – (లేపిడోప్టేరాన్ జీవి)
    • ఎపిరిక్రానియా మేలనోల్యుకా @ హెక్టారుకు 8000 నుంచి 10000 కుకూన్లు లేదా 8 నుంచి 10 లక్షల గుడ్లు

అనుకూల వాతావరణం

తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎరువులు ఎక్కువైనప్పుడు, పంటలో నీళ్ళు ఎక్కువైనప్పుడు, వానా కాల పరిస్థితుల్లో కూడా పురుగు తీవ్రత ఎక్కువవుతుంది. 
 

7.  పేను బంక Scientific Name :  Rhopalosiphum maidis

లక్షణాలు
ఈ పురుగు అనేక ప్రాంతాలలో విస్తరించి ఉండి, ప్రధానంగా కరువు పరిస్థితుల్లో ఉధృతమవుతుంది. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకులు, పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. దానివల్ల వాటిమీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. పురుగు సోకినా మొక్క ఎదుగుదల ఉండదు. క్రమేపి అవి ఎరుపు రంగుకు మారతాయి.  ఒక్కోసారి మొగ్గలు, పిందెలు, గింజలు కూడా దెబ్బతింటాయి. ఇది జొన్నలో మొజాయిక్ వైరసును వ్యాప్తి చేస్తుంది. దీనీవల్ల లేత మొక్కలు చనిపోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, పిందెలు, మొగ్గలు

పురుగు జీవిత చక్రం
  గుడ్డు దశ :

ఈ పురుగుకు సంబంధించి మన వాతావరణ పరిస్థితుల్లో గుడ్డు దశ ఉండదు.  వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తల్లి పురుగు గుడ్లు పెడుతుంది. వేసవి కాలం, శీతా కాలంలో సంతానోత్పత్తి జరుగదు. 
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు నాలుగు దశలలో పెరుగుతుంది. ఉష్ణోగ్రతను బట్టి ఈ పెరుగుదల ఉంటుంది. మొత్తంమీద పూర్తిగా పెరగడానికి 8 నుంచి 16 రోజులు పడుతుంది.
కోశస్థ (ప్యుపా) దశ:
ఈ పురుగుకు  కోశస్థ దశ ఉండదు.
తల్లి పురుగు
తొలి దశలో రెక్కలున్న ఆడ పురుగులు సరైన మొక్కల కోసం వెతుకుతూ ఉంటాయి. కొన్ని రోజుల్లోనే అవి పిల్ల పురుగులను  పెడతాయి. ఇవి తిరిగి రెక్కలు లేని ఆడ పురుగులుగా ఎదుగుతాయి.  వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎక్కువ పురుగులు పుడతాయి. ఇలా పుట్టిన పురుగులు ఇతర మొక్కల మీదకు వలస పోతాయి. మగ పురుగులు ఎక్కువగా కనపడవు. మగ పురుగులతొ కలవకుండానే ఆడ పురుగులు పిల్ల పురుగులను పెడతాయి.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ :

ఈ పురుగుకు గుడ్డు దశ ఉండదు. ఆడ పురుగులు నేరుగా పిల్ల పురుగులను పెడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
తొలి దశ పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తల అంచులు, కాళ్ళు శరీరం కన్నా కొంత నల్లగా ఉంటాయి. రెండో దశ పిల్ల పురుగులు కూడా లేత ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. తల, కడుపు, కాళ్ళు మిగతా శరీరం కన్నా కొంత చిక్కగా ఉంటాయి. కాళ్ళు సన్నగా ఉంటాయి.  కళ్ళు ఎర్రగా ఉంటాయి. మూడో దశలో కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. కానీ పక్కల వెంబడి కొంత చిక్కగా ఉమ్తయ్యి. కాళ్ళు శరీరం కన్నా చిక్కగా, బరువుగా  ఉంటాయి.  తల మాత్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

కోశస్థ (ప్యుపా) దశ:
ఈ పురుగుకు కోశస్థ  దశ ఉండదు.

తల్లి పురుగు :
తల్లి పురుగుకు రెక్కలు ఉండవు. పురుగు గుండ్రంగా, 2 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. లేత నీలం, ఆకుపచ్చ  రంగులో ఉంటుంది. తల మీద దట్టంగా రెండు నిలువు చారలు ఉంటాయి. ఉదరం మీద రెండు పక్కలా వరుసలలో నల్లటి మచ్చలు ఉంటాయి. శరీరం మీద పూర్తిగా పౌడర్ చల్లినట్లు మచ్చలు ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డై మీతోయేట్ లేదా 1.6  మిల్లి లీటర్ల మోనో క్రోటోఫాస్ లేదా ఒక గ్రాము ఆసిఫేట్ కలిపి చల్లాలి.

  • జీవ పద్దతులు
    • మిత్ర పురుగులను ప్రోత్సహించడం  (కోకినేల్లిడ్స్, సిర్ఫిడ్స్, క్రిసోఫిడ్స్ వంటివి)  

అనుకూల వాతావరణం
20 నుంచి ౩0 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

 

8.  చీడలు Scientific Name  : Odontotermes obesus  

గుంపులు గుంపులుగా ఉండే ఈ చీడ పురుగులు తమలో తాము తమ శ్రమను విభజించుకుంటాయి. కొన్ని కూలీలుగాను, కొన్ని సైనికులుగాను, మరికొన్ని పునరుత్పత్తి జరిపే వాటిగాను (రాజు, రాణి గాను)  పనిచేస్తాయి. మొక్క జొన్నతో పాటు చిరు ధాన్యాల పంటలు, పప్పు ధాన్యాల పంటలను ఆశిస్తుంది.   

లక్షణాలు
మొక్క చుట్టూ పక్కల తెల్లటి శరీరం, గోధుమ రంగు తలతో ఈ చీడలు కనిపిస్తాయి. వీటిలో  ఎక్కువగా కూలీ వర్గానికి చెందిన చీడ పురుగులే ఉంటాయి. పైన మట్టితో మొక్క కాండాన్ని పూర్తిగా కప్పి వేస్తాయి. ఈ మట్టి పొరల కింద ఉంటూ మొక్క భాగాలని  తింటూ బతుకుతాయి. క్రమేపీ ఇవి వాటంతట అవే బలహీనపడతాయి.
మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

ఆడపురుగు గుడ్లను పెట్టిన తరువాత ఈ చీడలు తమ జీవిత చక్రంలో అనేక రకాల దశలను పూర్తి చేస్తాయి.  ఒక ఆడ పురుగు రోజుకు ౩0000 గుడ్లను పెడుతుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
ఫలదీకరణం చెందిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కూలీ పురుగులుగా ఎదుగుతాయి.  మామూలు ఆహారం మీద ఆధారపడతాయి కాబట్టి వాటి ఎదుగుదల అంతంతగానే ఉంటుంది.  ఇక సైనికులుగా పుట్టే చీడల సంహ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ఫలదీకరణం చెందని గుడ్ల నుంచి వస్తాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
తల్లి పురుగు
రెక్కలున్న పెద్ద పురుగులకు సంతానోత్పత్తి స్వభావం ఉంటుంది. రెక్కల దశ రాగానే ఇవి ఎగురుతూ ఉంటాయి. సంతానోత్పత్తి కోసం ఆడ మగ పురుగులు కలిసేముందు  రెక్కలను వదిలించుకుంటాయి. కలిసిన వారం, పది రోజుల తరువాత ఆడపురుగు తొలి విడతగా 100 నుంచి 1౩0 గుడ్లు పెడుతుంది. ఇవి 40 నుంచి 45 రోజులలో పొదగబడతాయి.  ఆడ చీడ పురుగు తనకు తాను తన శరీరం పెద్దది చేసుకుని ‘రాణి’ చీడ పురుగుగా ఎదుగుతుంది.   

పురుగును గుర్తించడం
గుడ్డు దశ :

చీడల గుడ్లు  తెల్లగా, చిన్నగా ఉంటాయి.  బల్ల పరుపుగా ఉండి, పారదర్శకంగా  కనపడుతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
కొన్ని వారాలలోనే గుడ్ల నుంచి పిల్ల పురుగులు వస్తాయి. ఇవి కూడా గుడ్ల పరిమాణంలోనే ఉంటాయి. కూలీలుగా మారే చీడ పురుగులు ఇవి. సంఖ్యాపరంగా ఇవే ఎక్కువగా ఉంటాయి.  ఇతర పురుగుల పిల్ల పురుగుల మాదిరిగానే, ఈ చీడల పిల్ల పురుగులు కూడా అనేక రకాలుగా రూపాంతరం చెందుతాయి.  ఈ క్రమంలో అవి తమ చర్మాన్ని కోల్పోతాయి.  ఈ పిల్ల పురుగుల నుంచే ఆయా రకాల చీడ పురుగులు  (కూలీలు, సైనికులు, సంతానోత్పత్తి జరిపే పురుగులు వంటివి) వస్తాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • హెక్టారుకు 20 కిలోల ఫెప్రోనిల్ గుళికలను వేసి, లేత తడి ఇవ్వాలి. 
      • చీడ పురుగులు అక్కడక్కడ ఉంటే, ఒక్కో మొక్కకు 2 నుంచి ౩  ఫెప్రోనిల్ గుళికలను వేయాలి.
  • జీవ పద్దతులు
      • ముందున్న పంటను సరిగా కోయడం.
      • విత్తడానికి ముందు, ఆ తరువాత అప్పుడప్పుడు నీళ్ళు పెట్టడం
      • పెంట పోగు ఎరువు చల్లడం
      • వేప పిండి చల్లడం
        అనుకూల వాతావరణం

తక్కువ తేమ, నేలలో పొడి వాతావరణం ఉన్నప్పుడు చీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

 
 

మొక్క జొన్న -  తెగుళ్ళు

బాక్టీరియల్ స్టాక్ రాట్

ఇది  ఎర్వినా కోరోటోవోరా, ఎర్వినో క్రిసాంతేమి అనే బాక్టీరియా వల్ల వస్తుంది.  మొక్క జొన్న, జొన్న, బంగాళా దుంప, ఉల్లి, క్యాబేజీ, టమాట, పొగాకు పంటలని ఆశించే తెగులు ఇది.   
లక్షణాలు

ముందుగా పై భాగంలో ఉన్న ఆకులు వడలి రాలిపోతాయి.  రాను రాను కింద ఆకులు కూడా రాలిపోతాయి.

    • కింద నుంచి తెగులు మొక్క పైకి ఎగబాకుతుంది. లేదా పై నుంచి కిందకు దిగుతుంది. అడుగు భాగంలో తెగులు సోకితే, ఆకులు పసుపు పచ్చగా మారతాయి. దెబ్బతిన్న కణజాలం  గోధుమ రంగుకు మారుతుంది. మృదువుగా తయారవుతుంది. నీటిలో తడిసినట్టు అవుతుంది.  మొక్క కాండం లోపలి కణజాలం మెత్తటి ముద్దగా మారడం వల్ల మొక్క నిలబడలేక పోతుంది. కింద కణుపుల దగ్గర తియ్యదనంతో కూడిన కుళ్ళు వాసన వస్తుంది. ఈ వాసనతో పాటు కుళ్ళిన కణజాలం దగ్గర చిన్న చిన్న బాక్టీరియా పురుగులు తిరుగుతూ ఉంటాయి.
    • తెగులు పెరిగిన కొద్దీ  మొక్క కాండం పూర్తిగా ఎండిపోతుంది. లోపలి కణజాలం ఎండిపోవడం వల్ల కాండం ముద్దగా మారుతుంది.
తెగులు పై నుంచి కిందకు దిగుతున్నప్పుడు  మొక్క మధ్యలో ఉన్న ఆకుల చివరి భాగాలు వడలి, ఎండిపోతూ ఉంటాయి.  కిందకు తొందరగా వ్యాపించి చివరకు మొక్క పూర్తిగా ఎండిపోతుంది.      

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

తెగులు జీవిత చక్రం
ఈ తెగులకు కారకమయ్యే బాక్టీరియా పంట అవశేషాల మీద బతుకుతుంది.  మొక్కకున్న సహజ రంధ్రాల ద్వారా కానీ లేదా వానలు, గాలి ఎక్కువగా వచ్చినప్పుడు కలిగే రంధ్రాల ద్వారా బాక్టీరియా మొక్కను ఆశిస్తుంది.  రంధ్రాలు చేసే ఈ బాక్టీరియా జీవుల వల్ల మొక్కకు బాగా నష్టమవుతుంది.

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • జీవ పద్దతులు
      • తెగుళ్లను తట్టుకునే వంగడాలను వాడటం
      • నీరు నిల్వ లేకుండా చూసుకోవడం – మురుగు నీరు పోయే మార్గాలు చేసుకోవడం

అనుకూల వాతావరణం

తేమ, ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు (85 నుంచి 95 డిగ్రీల ఫారన్ హీట్) తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.   మొక్క నుంచి మొక్కకు ఎక్కువగా వ్యాప్తి  చెందనప్పటికీ, బాక్టీరియా జీవులు ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా జరుగవచ్చు.  అధిక వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, నీరు చెరువుల నుంచి, బావుల నుంచి ఎత్తిపోసే పరిస్థితులు,  లేదా మెల్లగా ప్రవహించే కాలువలు ఉన్న చోట ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది.
 
పైతియం స్టాక్ రాట్

ఇది  పైతియం అఫానిడేర్మాటం అనే ఫంగస్ వల్ల వస్తుంది.  ఎక్కువగా మొక్క జొన్న పంటలో వస్తుంది

లక్షణాలు
కాండం కింద భాగంలో ఉన్న కణుపులు మృదువుగా మారతాయి. ముదురు గోధుమ రంగులో ఉండి, తడి బాగా తెలుస్తుంది. దీనివల్ల మొక్క కుళ్ళి విరిగిపోతుంది. దెబ్బ తిన్న కణుపుల దగ్గర చుట్టుకున్నట్టు  ఉంటుంది. తెగులు సోకినా మొక్క భాగాలు అన్నీ పాడయ్యేదాకా మొక్క బతికే ఉంటుంది

మొక్కలో  పాడయ్యే భాగాలు
వేర్లు, కాండం

తెగులు జీవిత చక్రం
తడి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో వచ్చే ఫంగస్ ఇది.  తడి నేలల్లో  ప్రవహించే నీటి పొరలపై కదలాడుతూ ఉండే పైథియం ఫంగస్ జీవులతొ ఇది వ్యాప్తి చెందుతుంది.  ఈ జీవులు మొక్క వేర్లలోనికి పోయి నష్టం చేస్తాయి.  ఇతర తెగుళ్ల మాదిరిగా ఈ ఫంగస్ సోకినప్పుడు మొక్క అడుగు భాగంలో ఎలాంటి మచ్చలు, లక్షణాలు పైకి కనపడవు.  అయితే కాండం అడుగు భాగం లేదా వేర్లు కోసినప్పుడు తెగులు సోకినా భాగం పూర్తిగా తడిగా, ముద్దగా మారిపోయి కనపడుతుంది. 

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

 (5 నుంచి 7 వారాల పంట వయస్సులో, మొక్క అడుగు భాగంలో కణుపుల దగ్గర, లీటరు నీటికి గ్రాము కప్టాన్ మందును కలిపి మట్టితో చల్లాలి.   

  • జీవ పద్దతులు
    • హెక్టారుకు 50000 మొక్కల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం
    • మురుగు నీటి సౌకర్యం బాగా ఉండేలా చూసుకోవడం
    • అంతకు ముందటి పంట అవశేషాలను తొలగించడం
    • తెగులు నిరోధక వంగడాలను వాడటం

అనుకూల వాతావరణం

ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్ హీట్ దాటినప్పుడు లేదా తడి వాతావరణం కొనసాగినప్పుడు, మురుగు నీరి పోయే సౌకర్యం సరిగా లేనప్పుడు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది.  

 

ఫుజేరియం స్టాక్ రాట్

ఇది  ఫుసేరియం మొనిలిఫోర్మే అనే ఫంగస్ వల్ల వస్తుంది..   మొక్క జొన్నతో పాటు చిరు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.  
లక్షణాలు
తెగులు సోకిన మొక్క  వడలిపోతుంది. ఆకులు లేత రంగు నుంచి ముదురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. కాండం కింద భాగాలు గడ్డి రంగుకు మారతాయి. తెగులు సోకిన కాండం లోపలి  భాగంలో  ఎరుపు రంగు మచ్చలు కనపడతాయి. వేర్ల ద్వారా ఫంగస్ కాండం లోపలి భాగాల లోనికి వ్యాపిస్తుంది.  మొక్క పూత దశలో ఇది ఎక్కువగా సోకుతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, వేర్లు, కాండం లేదా వెన్ను

తెగులు జీవిత చక్రం
ఇది మొక్క జొన్న పంటలో విరివిగా వ్యాపించే తెగులు. తెగులు కారక ఫంగస్ జీవులు విత్తనాల ద్వారా వ్యాపిస్తాయి.  75% తెగులు వ్యాప్తి ఇలాగే జరుగుతుంది. చలి కాలంలో ఈ ఫంగస్ జీవులు నేలలో కానీ, కింద ఉన్న చెత్తలో కానీ  ఉండి, నేరుగా మొక్క వేర్లలోనికి వెళ్లి అవి కుళ్ళిపోయేలా చేస్తాయి. అదే క్రమంలో కాండం కింద భాగాన్ని కూడా పాడు చేస్తాయి.  ఒక్కొక్కసారి ఆకుల నుంచి కూడా కిందకు వ్యాపించి కణుపుల దగ్గర మొక్కను నాశనం చేస్తాయి.

   తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • జీవ పద్దతులు
    • పోటాషియం  ఎరువులను చల్లడం
    • దెబ్బతిన్న విత్తనాలను నాటకుండా ఉండటం
    • పంటల మార్పిడి
    • తెగులు నిరోధక వంగడాలను వాడటం
    • సరైన రీతిలో మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోవడం
    • పురుగులు సోకకుండా చూసుకోవడం

అనుకూల వాతావరణం
వేడి, పొడి వాతావరణం, పురుగుల ఉంద్రుతి ఎక్కువగా ఉండడం, వాతావరణ పరిస్థితుల ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది.

 
లేట్ విల్ట్

ఇది  సేఫాలో స్పోరియం మేడిస్, సెఫాలో స్పోరియం అక్రిమోనియం అనే ఫంగస్  వల్ల వస్తుంది.

లక్షణాలు
ఈ తెగులు  వల్ల పూత తరువాత వెంటనే మొక్క చనిపోయే అవకాశం ఉంది.  తెగులు సోకినా మొక్కలో చివరి వరకు ఎలాంటి రోగ లక్షణాలు కనపడవు.

ముందుగా పైనున్న ఆకులు వడలుతాయి.  ఆకులు వెలిసిన ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. తరువాత పూర్తిగా రంగు కోల్పోయి, ఎండిపోతాయి.

తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, కాండం కూడా ఆకుపచ్చ రంగు కోల్పోతుంది.  కింది భాగం పూర్తిగా ఎండిపోతుంది. ముడతలు పడి ముడుచుకుపోతుంది.  గట్టిపడి, మెల్ల మెల్లగా ఊదా రంగు లేదా  ముదురు గోధుమ రంగుకు మారుతుంది. కింది కణుపుల దగ్గర ఇది స్పష్టంగా కనపడుతుంది.
తెగులుసోకిన మొక్క కాండం తెరిచి చూసినట్టయితే కింద వేర్ల దగ్గర  గోధుమ రంగు కణజాలం ముద్దలుగా కనపడుతుంది. 
తెగులు ఎక్కువైనప్పుడు మొక్కల ఎదుగుదల నిలిచి పోతుంది. దానివల్ల ఒక్కోసారి 100% నష్టం వాటిల్లుతుంది.
సేఫాలో స్పోరియం మేడిస్ ఫంగస్ ఎక్కువగా నేలలోనే ఉంటుంది. లేత మొక్కలకు వాటి వేర్ల ద్వారా తొందరగా సోకుతుంది. సెఫాలో స్పోరియం అక్రిమోనియం  సోకినప్పుడు కాండంలోని కణజాలం నల్లగా మారుతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం లేదా వెన్ను
తెగులు జీవిత చక్రం
తెగులుకు  కారణమయ్యే ఫంగస్ జీవులు నేలలోనూ, నీటిలోనూ, మొక్క పరిసరాలలోని చెత్తలోనూ  ఉంటాయి. పూత తరువాత నీటి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు త్వరగా వస్తుంది.

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

విత్తన శుద్ధి  -  కిలో విత్తనానికి ౩ గ్రాముల థైరాం లేదా కాప్తాన్ కలిపి శుద్ధి చేయాలి.

  • జీవ పద్దతులు
      • తెగులు నిరోధక వంగడాలను వాడటం (గంగా సాఫేడ్ రకం)
      • పంట పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం
      • పంటల మార్పిడి
      • పూత దశలో పంటలో ఎక్కువగా నీరు లేకుండా చూసుకోవడం

అనుకూల వాతావరణం
పూత దశలో పంటలో ఎక్కువగా నీరు ఉంటే ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువ.  

చార్ కోల్ రాట్

ఇది  మాక్రోఫెమినా ఫెసియోలీన అనే ఫంగస్  వల్ల వస్తుంది. మొక్క జొన్నతో పాటు చిరు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.    
లక్షణాలు
పంట పెరుగుతున్న తీరుకు అనుగుణంగా తెగులు లక్షణాలు స్పష్టమవుతూ ఉంటాయి. పూతకు వచ్చిన ఒకటి, రెండు వారాల్లో తెగులు కనపడుతుంది. ఫంగస్  సోకినప్పుడు మొక్క తొందరగా ముదిరినట్టు  తయారవుతుంది. కింద కణుపుల బయటి అంచులు గడ్డి రంగుకు మారుతాయి. వేర్లకు తెగులు సోకితే, వాటిలోపలి కణజాలం మీద నల్లటి ఆహార పదార్థాలు వంటివి కనపడుతాయి. మొక్క పెరుగుతున్న కొద్దీ, కాండం లోపలి భాగాలు కూడా రంగు కోల్పోయి నల్లగా మారుతాయి.  తెగులు సోకిన మొక్క భాగాలు విరిగిపోతాయి. 

మొక్కలో  పాడయ్యే భాగాలు
వేర్లు, కాండం

తెగులు జీవిత చక్రం
ఈ ఫంగస్  కుళ్ళిన సేంద్రియ పదార్థం మీద బతకగలుగుతుంది.  చలి కాలంలో నేలలోనే కుళ్ళిన ఆహార పదార్థాల మాదిరిగా ఉండి, వేర్ల ద్వారా మొక్క జొన్న పంటను ఆశ్రయిస్తుంది. మెల్లగా కాండాన్ని సోకుతుంది.

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

విత్తన శుద్ధి – కిలో విత్తనానికి ౩ గ్రాముల కార్బెందాజిం లేదా థైరాం కలిపి విత్తన శుద్ధి చేయాలి.

  • జీవ పద్దతులు
      • పూత దశలో పంటలో నీటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం
      • పెంట పోగుతో ట్రైకో డేర్మాను కలిపి సాళ్ళలో చల్లడం (చల్లడానికి 10 రోజుల ముందే తయారుచేసుకుని ఉంచాలి.)
      •  పూత దశలో సరిపడా నీరు పెట్టడం
      • తెగులు నిరోధక వంగడాలను వాడటం
      • పంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం
      • పంటల మార్పిడి పాటించడం

అనుకూల వాతావరణం
నేలలో ఉష్ణోగ్రత ౩0 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, తేమ తక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువ. 

 
కామన్ రస్ట్

ఇది  మాక్రోఫెమినా ఫెసియోలీన అనే ఫంగస్  వల్ల వస్తుంది.  మొక్క జొన్నతో పాటు జొన్న, చిరు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.  
లక్షణాలు
ఈ తెగులు సోకిన మొక్క ఆకుల మీద గుండ్రటి, పొడవాటి, బంగారు గోధుమ రంగులో, పౌడర్ లాంటి చిన్న చిన్న మచ్చలు కనపడుతాయి.  పంట పెరుగుతున్న కొద్దీ గోధుమ, నలుపు మచ్చలు ఏర్పడతాయి.  అక్కడక్కడా దట్టంగా ఫంగస్ జీవ కణాలు కనపడుతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అది మొక్క లోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది.

 

మొక్కలో  పాడయ్యే భాగాలు

ఆకులు

తెగులు జీవిత చక్రం
దేశం లోని చలి ప్రాంతాలలో ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది.  మన ప్రాంతంలో రబీలో వేసే మొక్కజొన్న పంట ఈ తెగులు వల్ల బాగా దెబ్బ తింటుంది. కోస్తా జిల్లాలలో ఈ తెగులు వల్ల పంట నష్టం ఎక్కువగా కనపడుతుంది.  ఫంగస్ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. 

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

తెగులు లక్షణాలు కనపడిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మాన్కోజేబ్ లేదా డైతేన్ ఎం – 45 (0.4%) చల్లాలి.  పూత దశ వచ్చేవరకు ప్రతి 10 రోజులకు ఒకసారి ఇలా చల్లాలి.

  • జీవ పద్దతులు

తెగులు నిరోధక వంగడాలను వాడటం (డెక్కన్, గంగా 5. డెక్కన్ హైబ్రిడ్ మక్కా 10౩, డి.హెచ్.ఎం 1 వంటి రకాలను)
అనుకూల వాతావరణం

ఉష్ణోగ్రత 16 నుంచి 2౩ డిగ్రీల  సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితులలో తెగులు ఎక్కువగా వ్యాపిస్తుది. 

 
హెడ్ స్మట్

ఇది   స్ఫాసిలోతికా రీలియానా అనే ఫంగస్  వల్ల వస్తుంది.

లక్షణాలు
ప్రధానంగా మొక్క పూత దశలో ఈ తెగులు సోకుతుంది. పువ్వు భాగాలు పూర్తిగా కానీ, లేదా పాక్షికంగా కానీ  గోధుమ నలుపు రంగుకు మారుతాయి. పువ్వుల నుంచి వచ్చే ఆకు భాగాలకు కూడా తెగులు వ్యాపిస్తుంది. పువ్వు మొగ్గలలో ఎదుగుదల ఆగిపోతుంది.  పునరుత్పత్తికి  అవసరమయ్యే పరాగ రేణువుల ఉత్పత్తి కూడా ఉండదు.  తెగులు సోకిన మొక్క ఎదుగుదల కూడా నిలిచిపోతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు
తెగులు జీవిత చక్రం
ముందరి పంటలకు సోకినా ఫంగస్ జీవ కణాలు నేలలో బతికే ఉంటాయి. మొక్క మొలఎత్తినప్పుడు, నేలలోపల ఉండే భాగాలకు సోకుతాయి. క్రమేపి జీవ  కణాలు ఉత్పత్తి చేస్తూ లేత మొక్క అంచుల దాకా వ్యాపిస్తాయి.  ఎదిగే కాండం లోపలి ప్రవేశించి, మొక్క పునరుత్పత్తి భాగాలను కూడా పాడు చేస్తాయి.        
తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

విత్తన శుద్ధి -  కిలో విత్తనాలకు ౩ గ్రాముల థైరాం లేదా కప్తాన్ కలిపి విత్తనాలు శుద్ధి చేయాలి.

  • జీవ పద్దతులు
      • పంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం
      • పంటల మార్పిడి

అనుకూల వాతావరణం
ఫంగస్ నేలలో బతుకుతుంది.  భూమిలో తేమ 15 నుంచి 25 శాతం మధ్యలో ఉండి, ఉష్ణోగ్రత గరిష్టంగా 21 నుంచి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణ పరిస్థితులలో తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

 
మొజాయిక్ వైరస్ తెగులు

ఇది   రాబ్దో అనే వైరస్  వల్ల వస్తుంది.  మొక్క జొన్న పంటలో ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు            
ఆకుల పైన పచ్చటి మచ్చలు, చిన్న చిన్న గీతలు కనపడుతాయి.  విడిపోయి ఉన్నప్పటికీ ఇవి ఆకును మొత్తం వ్యాపిస్తాయి. కాండం, పిందెలపై  కూడా ఇలాంటి మచ్చలు, గీతాలు కనిపిస్తాయి. తెగులు ఆలస్యంగా సోకితే మాత్రం ఆకులు, కాండం, మిగతా భాగాలు అవే సైజూలో ఉంటాయి. 

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

తెగులు జీవిత చక్రం
ఇది మొక్క ఎదుగుదలను నియంత్రించే సీరియస్ తెగులు.  ఇది మొత్తం మొక్క  కణ జాలపు ఎదుగుదలను నిలిపి వేస్తుంది. ఆకుల మీద ఈనెలపై స్పష్టమైన తెల్లటి చారలు కనపడుతాయి.
వైరస్ వ్యాప్తి చేసే జీవులకు ఈ మొక్క జొన్న మొక్క అంటే ఇష్టం.  కేవలం ఈ పంట మీదనే వైరస్ బతుకుతుంది. మొక్కని అంటిపెట్టుకుని ఈ వైరస్ చాలా కాలం ఉంటుంది.

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి 1.5 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లి లీటర్ల డైమీతోయేట్ కలిపి చల్లితే, వైరస్ వ్యాప్తి చేసే కీటక పురుగులు అదుపులో ఉంటాయి.

  • జీవ పద్దతులు
      • పంటల మార్పిడి

అనుకూల వాతావరణం
వేడి వాతావరణ పరిస్థితులకు వైరస్ వ్యాప్తికి అనుకూలం