| |
పాము పొడ
Scientific Name : Liriomyza trifilii
పాము పొడ టమాట, తీగ కూర గాయలను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
మామూలుగా ఈ పురుగు పెద్దగా ఆర్ధిక నష్టం కలిగించదు. పురుగు చిన్నగా, నారింజ పసుపు రంగులో ఉంటుంది. పిల్ల పురుగులు ఆకుల పచ్చదనాన్నితినేస్తాయి. ఇలా తినడం వల్ల ఆకులపై పాము తిరిగినట్టు గుర్తులు ఏర్పడతాయి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ఎండి, రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
 |
|
|
 |
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తల్లి పురుగు ఆకుల కింద భాగంలో మొక్క కణజాలంలోకి గుడ్లను చొచ్చుకుపోయినట్లు పెడుతుంది.
మూడు, నాలుగు రోజుల లోపల ఈ గుడ్లు పొదగబడతాయి. మొక్క విసర్జించే ద్రవాలతో పాటు కణజాల పదార్థాలను తింటూ పురుగు బతుకుతుంది. ఒక ఆడ పురుగు తన జీవిత కాలంలో 600 నుంచి 700 వరకు గుడ్లు పెడుతుంది. సగటున 200 నుంచి ౩00 గుడ్లు పెడుతుందని అంచనా. తొలుత రోజుకు ఆడ పురుగు ౩0 నుంచి 40 గుడ్లను పెడుతుంది. అయితే పురుగు వయస్సు పెరుగుతున్న కొద్దీ గుడ్ల సంఖ్య తగ్గుతుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు దశ వారం రోజుల పాటు ఉంటుంది. ప్యుపా దశకు వెళ్ళే ముందు, పిల్ల పురుగు తొలిచిన ఆకు మీద అర్ధ చంద్రాకరంలో రంధ్రం చేస్తుంది. ఆకు పై భాగం మీదనే ఈ రంధ్రం ఉంటుంది. |
|
కోశాస్థ (ప్యుపా) దశ:
పిల్ల పురుగు ఆకు మీద చేసిన రంధ్రంలో నుంచి కిందకు నేల మీద పడిపోతుంది. తరువాత నేలలోకి కొన్ని సెంటి మీటర్ల లోతుకి బొరియను చేసి అందులో కోశాస్థ దశను గడుపుతుంది. ప్యుపా దశకు చేరే ముందు దశ నుంచి, నిద్రావస్థకు చేరే సమయం లోగా పిల్ల పురుగు ఒక రకమైన రూపాంతరం చెందుతుంది.
తల్లి పురుగు
ప్యుపా దశకు చేరిన తరువాత 9 రోజుల లోపల పెద్ద పురుగు బయటికి వస్తుంది. ప్రధానంగా ఉదయం సమయంలో, ఆడ, మగ పురుగులు కలిసే బయటికి వస్తాయి. మరుసటి రోజు ఆడ,మగ పురుగులు కలుస్తాయి. అప్పటి నుంచి ఆడ పురుగులు వేర్వేరు మగ పురుగులతో కలుస్తూనే ఉంటాయి. మొత్తం ౩ వారాలలో పురుగు జీవిత చక్రం పూర్తవుతుంది. |
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు తెల్లగా ఉంటాయి. బల్ల పరుపుగా ఉండే గుడ్లు 0.2౩ మిల్లి మీటర్ల పొడవు, 0.1౩ మిల్లి మీటర్ల వెడల్పు ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పెరిగిన లార్వా దాదాపు 2.2.5 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. ఈ దశలో మూడు రకాలుగా రూపాంతరం చెందుతుంది. తొలుత దాదాపుగా రంగు లేనట్టు ఉంటుంది. రాను రాను ఆకుపచ్చ రంగుకు, తరువాత పసుపు రంగుకు మారుతుంది. ఈ మూడు రకాల రూపాలలోనూ నల్లటి నోటి భాగాలు ఉంటాయి. పిల్ల పురుగులకు కాళ్ళు ఉండవు.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగు ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. 1.5 మిల్లి మీటర్ల పొడవు, 0. 75 మిల్లి మీటర్ల వెడల్పు ఉంటుంది.
రెక్కల పురుగు
రెక్కల పురుగు ప్రధానంగా పసుపు, నలుపు రంగులో ఉంటుంది. ఆడ పురుగులు మగ పురుగులు కన్నా పెద్దగా, లావుగా ఉంటాయి. వాటి ఉదర భాగం సాగినట్టు ఉంటుంది. రెక్కల నిడివి 1.25 – 1.70 మిల్లి మీటర్ల వరకు ఉంటుంది. సగటున మగ పురుగుల రెక్కల నిడివి 1. ౩ మిల్లి మీటర్లు, ఆడ పురుగుల రెక్కల నిడివి 1. 5 మిల్లి మీటర్లు ఉంటుంది. |
 |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- అవసరమైనప్పుడు, లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్, ౩ గ్రాముల కార్బారిల్ కలిపి చల్లాలి.
- పురుగు సోకిన ఆకుల ఏరి నాశనం చేయాలి.
- ఎన్.ఎస్.కె. ఇ (5%) ద్రావణం) చల్లాలి
|
|
లద్దె పురుగు
Scientific Name : Spodoptera litura
లద్దె పురుగు పత్తి, టమాట, వేరు శనగ, పొగాకు, పప్పు ధాన్యాల పంటలను పాడు చేస్తుంది. |
 |
లక్షణాలు
పిల్ల పురుగులు ఆకుల పై భాగంలో పచ్చదనాన్ని గీకి తింటాయి. పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండి రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఆడ పురుగు ౩00 నుంచి 500 గుడ్లను గుంపులుగా పెడుతుంది. గుడ్లపైన వెంట్రుకల మాదిరిగా ఉంటాయి. ఈ గుడ్లు ఆకుల కింద భాగంలో కనపడతాయి. 4 – 5 రోజులలో గుడ్లు పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు మామూలుగా రాత్రి పూట ఆహారం తిని, పొద్దంతా మొక్క అడుగు భాగాన ఉన్న చెత్తలో గానీ, లేదా నేలలో గానీ విశ్రాంతి తీసుకుంటాయి. సీజను, ఆహార లభ్యత బట్టి ఈ దశలో 20 – ౩0 రోజులు గడుపుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
నేలలోపల కొన్ని సెంటి మీటర్ల వరకు బొరియలను చేసి వాటిలో ఈ దశను గడుపుతాయి. గూడు లేకుండానే ఈ దశలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. అనుకూల పరిస్థితుల్లో వారం రోజుల లోపల ఈ దశను పూర్తి చేస్తుంది. పరిస్థితులు అనుకూలించనప్పుడు రెండు, మూడు నెలలు కూడా ఈ దశలోనే ఉంటుంది.
తల్లి పురుగు
పెద్ద పురుగుకు మంఛి డిజైన్ కలిగిన గోధుమ రంగు రెక్కలు ఉంటాయి. రెక్కలు అంచులు మంచి డిజైన్ తొ తీర్చిదిద్దినట్లు ఉంటాయి. 5 నుంచి 10 రోజుల పాటు బతుకుతాయి. ఈ కాలంలోనే పునరుత్పత్తి జరుపుతాయి.
మొత్తం మీద పురుగు ౩0 నుంచి 40 రోజుల లోపల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. |
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు బంగారు గోధుమ రంగు రంగులో, ఆకుల కింద భాగంలో గుంపులుగా కనపడతాయి. 4 నుంచి 7 మిల్లి మీటర్ల వ్యాసార్ధం కలిగి ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
తొలి తరం పిల్ల పురుగులు చాలా చురుకుగా కదులుతూ ఉంటాయి. పెరిగిన తరువాత వాటి శరీరం పైన, కింద భాగంలో ముదురు గోధుమ రంగు మచ్చలు కనపడతాయి. పురుగులు పెరుగుతున్న కొద్దీ, రంగు, మచ్చలు చాలా స్పష్టంగా మారుతూ ఉంటాయి. ఎక్కువ మట్టుకు పక్క పొలాలకు వలస పోతుంటాయి. అయితే రాత్రి పూట మాత్రం, మొక్క మొదట్లో అడుగు భాగాన విశ్రాంతి తీసుకుంటాయి.
|
 |
|
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగును గుర్తు పట్టడం కొంత కష్టమే. నేలలోపలికి బాగా చొచ్చుకుపోయి ఉంటాయి కాబట్టి స్పష్టంగా కనిపెట్టడం కష్టమవుతుంది. ఇలా వారం నుంచి కొన్ని వారాల పాటు ఈ దశలో ఉంటాయి. చూసినప్పుడు ఈ దశలో ఉన్న పురుగులు ముదురు గోధుమ రంగు నుంచి మెరిసే ఎరుపు రంగులో కనపడతాయి. పైన ఎటువంటి గూడు ఉండదు.
రెక్కల పురుగు
రెక్కల పురుగులు ఎక్కువగా రాత్రి పూట సంచరిస్తాయి. మంచి నమూనాలో, తీర్చిదిద్దినట్లు రెక్కలను కలిగి ఉంటాయి. |
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- విషపు గుళికలు - లీటరు నీటికి 5 కిలోల రైస్ బ్రాన్, 500 గ్రాముల మొలాసేస్ లేదా బ్రౌన్ షుగర్, 500 గ్రాముల కార్బారిల్ 50 డబ్ల్యు పి. కలిపి విషపు గుళికలను తయారు చేయాలి. వీటిని హెక్టారు పంటలో సాయంత్రం వేళలో అక్కడక్కడా పెట్టాలి.
- హెక్టారుకు 2 లీటర్ల క్లోరో ఫైరిఫాస్ 20 ఇ. సి లేదా లీటరు నీటికి డైక్లోరో వాస్ 76 డబ్ల్యు ఎస్ సి కలిపి చల్లాలి.
- నేలను లోతుగా దున్నడం వల్ల కోశాస్థ దశలో ఉన్న పురుగులు చనిపోతాయి.
- పొలాల హద్దుల వెంబడి, కాలువల వెంబడి ఎర పంటగా ఆముదం వేయడం
- నిద్రావస్థలో ఉన్న పిల్ల పురుగులని బయటకు పంపే రీతిలో పొలంలో నీటిని పెట్టడం
- హెక్టారుకు ఒక దీపపు ఎర పెట్టడం
- మగ పురుగులను ఆకర్షించడానికి హెక్టారుకు 15 లింగాకర్షక బుట్టలను పెట్టడం
- ఆముదం, టమాట పంటలో కనపడే గుడ్ల గుంపును ఏరి నాశనం చెయ్యడం
- కనపడే పిల్ల పురుగులను ఏరి చంపివెయ్యడం
- ఎన్. పి.వి ద్రావణం చల్లడం (1.5 X 1012 POBs / ha , 2.5 కిలోల క్రూడ్ షుగర్, 0.1% టీపాల్ కలిపి)
|
|
శనగ పచ్చ పురుగు
Scientific Name: Helicoverpa armigera
ఈ పురుగు టమాట, పత్తి, పప్పు ధాన్యాల పంటలను దెబ్బ తీస్తుంది. |
 |
లక్షణాలు
పిల్ల పురుగులు పండ్ల లోనికి చొచ్చుకుపోయి వాటిని పాడు చేస్తాయి. దానివల్ల అవి తినడానికి పనికి రాకుండా పోతాయి. పురుగు తొలిచిన కాయలు, పండ్ల మీద ఇష్టానుసారంగా పురుగు చేసిన రంధ్రాలు స్పష్టంగా కనపడతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
కాయలు |
 |
|
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
మొక్కలోని వేర్వేరు భాగాల పైన, వాటి కింద, పైన ఈ గుడ్లు కనపడతాయి. ఒక్కో ఆడ పురుగు 500 వరకు గుడ్లు పెడుతుంది. ఇవి 4 – 5 రోజులలో పొదగబడతాయి. గుడ్లు గుండ్రంగా, తెలుపు నుంచి ఆకు పచ్చ రంగులో ఉంటాయి. మైక్రో స్కోప్ కింద చూస్తే, గుడ్లకి అంచులు స్పష్టంగా కనపడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
వాతావరణ పరిస్థితులు, సీజను, ఆహార లభ్యతకు అనుగుణంగా పిల్ల పురుగు దశ 14 – 20 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలో పురుగు 6 రకాలుగా రూపాంతరం చెందుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను నేలలోపల, మొక్క అడుగు భాగంలోని పంట చెత్తలో ఈ దశను గడుపుతుంది. ఈ దశను 10 – 15 రోజుల లోపల పూర్తి చేస్తుంది.
రెక్కల పురుగు
రెక్కల పురుగు ఆహారం తినదు. ఇది 6 – 8 రోజుల వరకు బతుకుతుంది. మగ పురుగుతో కలిసిన తరువాత ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. మొత్తం జీవిత చక్రాన్ని పురుగు 40 రోజులలో పూర్తి చేస్తుంది. |
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు గుండ్రంగా, లేత గోధుమ తెలుపు రంగులో ఉంటాయి. విడివిడిగానే ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు వాటి రూపాంతర దశలకు అనుగుణంగా రంగును కలిగి ఉంటాయి. ఆకు పచ్చ, పసుపు, గులాబి, నారింజ, గోధుమ లేదా నలుపు రంగులో కనపడతాయి. శరీరం రెండు పక్కలా తేలికపాటి లేదా ముదురు చారలు ఉండడం పిల్ల పురుగులో కనపడే ప్రధాన లక్షణం.
పిల్ల పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఆకుల మీద పచ్చదనాన్ని తింటుంది. పెరిగిన తరువాత కాడలు, మొగ్గలు, పువ్వులలోనికి చొచ్చుకుపోయి వాటి భాగాలని తినేస్తాయి. దానివల్ల ఆయా భాగాలలో గుండ్రటి రంద్రాలు కనపడతాయి. ఈ రంధ్రాల దగ్గర పురుగుల విసర్జితాలు కూడా ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగు గోధుమ రంగులో ఉంటుంది. నేలలోపల గానీ, మొక్క అడుగు భాగంలోని పంట చెత్తలో కానీ ఈ దశను గడుపుతుంది.
తల్లి పురుగు
ఆడ పురుగుల ముందు రెక్కలు పసుపు నుంచి నారింజ రంగులో ఉంటాయి. మగ పురుగులు రెక్కలు ఆకు పచ్చ నుంచి బూడిద రంగులో ఉంటాయి. రెక్కల అంచుల వెంబడి వంకర టింకరగా ముదురు రంగు మచ్చలు ఉంటాయి. వెనుక రెక్కలు పాలిపోయిన పసుపు రంగులో ఉండి, వాటి బయటి అంచుల వెంబడి గోధుమ రంగు మచ్చలు, మధ్యలో చిక్కటి గుండ్రటి మచ్చలు ఉంటాయి. |
 |
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్, 1 మిల్లి లీటరు క్వినాల్ఫాస్ 25% ఇ.సి., 1౩ మిల్లి లీటర్ల ఫోసాలేన్ ౩5% కలిపి చల్లాలి.
- జీవ పద్దతులు
- పురుగు సోకిన కాయలు, పండ్లు, వాటిని అంటిపెట్టుకుని ఉండే పిల్ల పురుగులను ఏరి నాశనం చెయ్యాలి.
- హెక్టారుకు 12 లింగాకర్షక బుట్టలు వాడాలి
- సహజ శత్రువులను వదలడం –పువ్వు పూసే దశలో హెక్టారుకు లక్ష ట్రైకోగ్రమ్మా ప్రిటియోసం పురుగులను వదలడం
- ఎన్.పి.వి వైరస్ ద్రావణం చల్లడం - (HaNPV 1.5 x 1012 POBs/ha i.e. NPV of H. armigera 0.43% AS @ 3.0 ml/lit or 2 % AS @ 1.0 ml per lit
- హెక్టారుకు 7. 5 లీటర్ల నీటిలో 1.25 కిలోల కార్బారిల్ 50 డబ్ల్యు.పి., 12.5 కిలోల రైస్ బ్రాన్, 1.25 కిలోల బెల్లం కలిపి , విషపు గుళికలను తయారుచేసి పొలంలో పెట్టాలి.
- లీటరు నీటికి బెసిల్లాస్ తురిన్జియెన్సీస్ కలిపి చల్లాలి
|
|
తెల్ల దోమ
Scientific Name : Bemesia tabaci
టమాట, ఉల్లి, పత్తి పంటలను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల నుంచి రసాన్ని, పచ్చదనాన్ని పీలుస్తాయి. దానివల్ల అవి పసుపు రంగులోకి మారుతాయి. ఆకులు ఎండిపోతాయి. కొన్ని ఆకులు వంకర తిరుగుతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
|
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఆడ పురుగు దాదాపు 50 గుడ్ల వరకు పెడుతుంది. ౩ – 5 రోజులలో ఇవి పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు పాలిపోయిన పసుపు రంగులో ఉంటాయి. గుంపులుగా ఒకచోట ఉంటాయి. స్తబ్దుగా కదలకుండా ఉంటాయి. వేడి వాతావరణంలోనయితే 9 – 14 రోజులు, చలి పరిస్థితుల్లో 17 – 81 రోజుల పాటు ఈ దశలో ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ 2 – 8 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు
పురుగు 14 – 120 రోజులలో జీవిత చక్రం పూర్తి చేసుకుంటుంది. ఒక ఏడాదిలో 14 తరాలు పూర్తి అవుతాయి. ఏడాది పొడవునా సంతానోత్పత్తి జరుగుతుంది. కొన్ని సార్లు మగ పురుగుతో కలవకుండానే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు తేలికపాటి పసుపు రంగులో ఉంటాయి. ఆకుల కింద భాగంలో కనపడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండి, చుట్టూ బల్లపరుపు ఆకారాన్ని కలిగి ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ప్యుపా దశ బల్ల పరుపు ఆకారంలోనే ఉంటుంది. ఈ దశను కూడా ఆకుల కింద భాగంలోనే గడుపుతుంది. |
 |
రెక్కల పురుగు
రెక్కల పురుగు చాలా చిన్నదిగా ఉంటుంది. శరీరం పసుపు రంగులో ఉంటుంది. పైన తెల్లటి మైనపు వెలుగు ఉంటుంది. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల దియా మీథోయేట్ లేదా 2 మిల్లి లీటర్ల మీథైల్ డిమిటోన్ చల్లాలి.
- హెక్టారుకు 40 కిలోల కార్బోఫురాన్ ౩% జి చల్లాలి.
-
జీవ పద్దతులు
- రోగం సోకిన ఆకులని పీకి కాల్చివేయాలి.
- నత్రజని ఎరువులను, నీటిని అవసరమైన మేరకే వాడాలి.
- పురుగుకు ఆతిధ్యమిచ్చే కలుపు (అబుటిలాన్ ఇండికం) మొక్కలని తీసివేయాలి.
- పురుగు ఆకర్షించడానికి హెక్టారుకు 12 పసుపు పచ్చ ప్లేట్లు పెట్టాలి.
|
|
సేప్టోరియ ఆకు మచ్చ తెగులు
ఇది సేప్తోరియా లైకోపెర్సికి అనే ఫంగస్ వల్ల వస్తుంది. |
 |
లక్షణాలు
మొక్క కాయ వేసే కాలంలో, నేలకు దగ్గరగా ఉన్న ఆకులకు తెగులు సోకుతుంది. కాండం మీద కూడా మచ్చలు కనపడుతాయి. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉంటాయి. మచ్చల చుట్టూ చిక్కటి గోధుమ రంగు అంచులు ఏర్పడతాయి. ప్రతి మచ్చ చుట్టూ ఒక చిన్న పసుపు పచ్చ అంచు ఉంటుంది. మచ్చలు కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు లేదా గోధుమ రంగుకు మారుతాయి. అలా వడలి, ఎండి, చివరకు రాలిపోతాయి. |
 |
|
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు
తెగులు జీవిత చక్రం
మునుపటి పంట చెత్తలో ఈ ఫంగస్ ఉంటుంది. విత్తనాలి, మొలకల ద్వారా వ్యాపిస్తుంది. సగటు ఉష్ణోగ్రత, విపరీతంగా వానలు పడినప్పుడు జీవ కణాలు వృద్ధిచెందుతాయి. ఉష్ణోగ్రత 15.5 – 28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు జీవ కణాలు బాగా విడుదల అవుతాయి. గాలి, వాన ద్వారా చాలా సులభంగా వ్యాప్తి చెందుతాయి. మొక్క కాయ వేసే కాలంలో, నేలకు దగ్గరగా ఉన్న ఆకులకు తెగులు సోకుతుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- విత్తన శుద్ధి – కిలో విత్తనాలకు 2 గ్రాముల థైరాం లేదా 2 గ్రాముల డైతెన్ ఎం – 45 కలిపి శుద్ధి చేయాలి. దీనివల్ల విత్తనాల ద్వారా జరిగే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
- పంట పొలంలో డైతెన్ జెడ్ – 78 (0.2%) మందు చల్లితే తెగులు నియంత్రణలో ఉంటుంది.
- జీవ పద్దతులు
- తెగులు సోకిన భాగాలను ఏరి నాశనం చేయడం
- ఆరోగ్యకరమైన విత్తనాలను, తెగులు నిరోధక వంగడాలను వాడడం
- నేలకు తాకే కొమ్మలను విరిచివేయడం
- పొలంలో నీరు ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం
- పొద్దునే నీరు పెడుతూ, తొందరగా ఆకులు ఎండేలా చూడడం
- ప్రతి ఏడాది పంటల మార్పిడి చేయడం
- మొక్క మొదట్లో నేలపై 2 – 4 అంగుళాల మేర మల్చింగ్ చేయడం – ఎండు గడ్డి ముక్కలను పరిచినప్పుడు అది ఫంగస్ నుంచి విడుదల అయ్యే జీవ కణాలను అడ్డుకుంటుంది.
అనుకూల వాతావరణం
ఉష్ణోగ్రత 20 – 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో ఉన్నప్పుడు, వానలు బాగా పడుతున్నప్పుడు తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. నీటి ద్వారా కూడా వ్యాపిస్తాయి. ఆకుల మీద ఎక్కువ కాలం తడి ఉన్నా, వాతావరణంలో తేమ, వేడి ఎక్కువగా ఉన్నా అది తెగులు వ్యాప్తికి అనుకూల సమయం. |
|
అర్లీ బ్లైట్
ఇది ఆల్టర్ నేరియా సోలోని అనే ఫంగస్ వల్ల వస్తుంది. |
 |
లక్షణాలు
టమాట పంటలో సాధారణంగా వచ్చే తెగులు ఇది. పంట ఏ దశలో ఉన్నప్పుడైనా ఈ తెగులు వస్తుంది. ప్రధానంగా మొక్కలోని లేత భాగాల మీద దాడి చేస్తుంది. ఆకుల మీద మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి ఎండిపోతాయి. తొలుత చిన్న చిన్న మచ్చలు ఏర్పడి, అవన్నీ కలిసినప్పుడు ఎండిపొయినట్లు కనపడుతాయి. మచ్చలు పెద్దవి అవుతున్నప్పుడు, అంటే ¼ అంగుళం లేదా అంత కన్నా ఎక్కువ వ్యాసార్దానికి పెరిగినప్పుడు , తెగులు సోకిన ప్రాంతం మధ్య భాగంలో వలయారపు వృత్తాలు ఏర్పడతాయి. ఈ మచ్చలకు దగ్గరగా ఉన్న కణజాలం పసుపు రంగులోకి మారుతుంది. ఈ సమయంలో వాతావరణంలో వేడి, తేమ గనుక ఎక్కువైతే ఆకులు చచ్చిపోతాయి. |
 |
|
 |
కాండం మీద కూడా ఆకుల మీద ఉన్న మచ్చలు లాంటివే కనపడతాయి. మొక్క మొదట్లో, నేలకు దగ్గరగా కాండం మీద ఈ మచ్చలు ఉంటే, క్రమేపి మొక్క నిలబడలేక పడిపోతుంది. లేత మొలకలకు తెగులు సోకితే, నాటిన వెంటనే చనిపోతాయి. ఒక్కొక్కసారి ఫంగస్ కాయలను కూడా పాడు చేస్తుంది. కాయల మీద కూడా ఆకుల మాదిరే వలయాకారపు వృత్తాలతో కూడిన మచ్చలు కనపడుతాయి. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం, మొలకలు, కాయలు
తెగులు జీవిత చక్రం
తెగులు సోకిన పంట పొలంలోని నేలలోనూ, పంట అవశేషాలలోనూ ఫంగస్ బతికి ఉంటుంది. అదే పొలంలో అదే పంటను పదేపదే వేయడం వల్ల తెగులు తిరిగి తలెత్తుతుంది. తెగులు సోకిన విత్తనాల ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. గాలి, నీరు, పురుగులు, మనుషులు, పంటకు వాడే వివిధ ఉపకరణాల ద్వారా తెగులు ఇతర మొక్కలకు, ఇతర ప్రాంతాలకి విస్తరిస్తుంది. ఈ రీతిలో మొక్కల మీద విస్తరించిన ఫంగస్ జీవ కణాలు, ఆకులు తడిగా ఉన్నప్పుడు వాటిని పాడు చేస్తాయి.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- తెగులు తొలి లక్షణాలు కనపడిన వెంటనే కార్బామేట్స్ లేదా క్లోరోతలోనిల్ లేదా క్యుప్రిక్స్ వంటి మందులను మొక్కలపై వాడాలి. వాతావరణం తడిగా ఉంటే, వారం రోజులకు ఒక సారి లేదా చల్ల్లాలి. పొడిగా ఉంటే 1౦ రోజులకు ఒక సారైనా చల్లవచ్చు. వానలు పడినప్పుడు లేదా పంటకు నీళ్ళు పెట్టినప్పుడు అప్పటికి కొట్టిన మందులు పంటపై నిలబడవు కాబట్టి వాటిని మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
- తెగులుని నియంత్రించడానికి దిఫోలతాన్ (0.2%) లేదా దైతేన్ ఎం – 45 (0.2%) లేదా బవిస్టిన్ (0.1%) వంటి మందులను కూడా చల్లవచ్చు.
- జీవ పద్దతులు
- పంటల మార్పిడి - రెండేళ్ళ పాటి వరుసగా టమాట, మిరప, వంకాయ వంటి పంటలను వేసిన నేలలో అవే పంటలను వేయకూడదు.
- తెగులు ఉన్న మట్టి మొక్కకు అంటకుండా ఉండేందుకు గాను మొక్క చుట్టూ మల్చింగ్ చేయాలి. గడ్డి జాతి మొక్కలను మొక్క చుట్టూ వేస్తే తెగులు విస్తరించదు
- పై నుంచి మొక్కలకు నీరు పోస్తే, ఉదయం వేళలలోనే పోయాలి. అప్పుడు రోజులో ఆకులు తడి లేకుండా పొడిగా ఉంటాయి. ఇలా పొడిగా ఉంటే తెగులు సోకడం తక్కువ .
- తెగులు నిరోధక విత్తనాలు, వంగడాలు వాడాలి.
- నాటే ముందు మొక్క మొలకను తెగులు ఉందో లేదో బాగా పరిశీలించాలి. తెగులు లక్షణాలు కనపడితే ఆ మొలకను నాశనం చేయాలి.
- నేలలో సేంద్రియ పదార్థం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. అది కూడా వేళ్ళకు బాగా అందే రీతిలో ఉండాలి.
- ఆఫ్ – సీజనులో నత్రజని స్థిరీకరించే పచ్చి ఎరువులు నేలకు అందించాలి.
- తెగులు సోకిన మొక్కలను, మొక్క భాగాలను ఏరి నాశనం చేయాలి.
అనుకూల వాతావరణం
ఎక్కువ కాయలు ఉన్న మొక్కలు, తక్కువ నత్రజని ఉన్న పొలాలలో ఈ ఫంగస్ ఎక్కువ ఉంటుంది. వానా కాలంలో దీని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. |
|
బాక్టీరియల్ ఆకు మచ్చ తెగులు
ఇది జాన్తోమోనాస్ కంపెస్త్రిస్ అనే బాక్టీరియా వల్ల వచ్చే తెగులు. |
 |
లక్షణాలు
తెగులు సోకిన మొక్కల ఆకులపై చిన్నటి, గుండ్రటి, తడిసినట్లు కనపడే గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వాటి చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి. పెరిగిన మొక్కలలో, ముందుగా వచ్చిన ఆకుల మీదనే ఈ తెగులు ప్రభావం ఎక్కువ కనపడుతుంది. ఈ ఆకులు పూర్తిగా పచ్చదనం కోల్పోతాయి. పచ్చటి కాయపై తెగులు లక్షణాలు స్పష్టంగా కనపడుతాయి. ముందుగా చిన్నగా ఉండే మచ్చలు క్రమేపి పెద్దవి అవుతాయి. చివరకు 1/8 – ¼ అంగుళం మేర వ్యాసార్ధం కలిగిన మచ్చలుగా మారుతాయి. ఈ మచ్చల మధ్య భాగంలో లేత గోధుమ రంగులో, కొంచెం కృంగినట్లు, గరకుగా ఉంటుంది. కాయ పక్వానికి వచ్చిన తరువాత ఈ తెగులు సోకదు. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
కాయలు
తెగులు జీవిత చక్రం
విత్తనం పై భాగంలో బాక్టీరియా ప్రభావం చూపుతుంది. అక్కడే కొంత కాలం ఉంటుంది. తెగులు సోకిన ఇతర మొక్కల భాగాలలోనూ, పంట అవషేశాలలోనూ బతికి ఉంటుంది. విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా కొట్టుకు వచ్చే మట్టి, పురుగులు ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. గాలితో కూడిన వానలు పడినప్పుడు కూడా ఇది విస్తరిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలో కాయ పక్వానికి రాదు.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- విత్తన శుద్ధి – మెర్క్యురిక్ క్లోరైడ్ (1 : 1000 నిష్పత్తిలో)తో విత్తనాలను శుద్ధి చేయాలి.
- కాపర్. ఆర్గానిక్ ఫంజిసైడ్ల మిశ్రమం కూడా చల్లవచ్చు. 5 – 10 రోజుల విరామంతో ఈ మిశ్రమాన్ని చల్లితే తెగులు రాకుండా ఆపవచ్చు.
- అగ్రి మైసిన్ – 100 (100 పిపిఎం) మందును 10 రోజుల విరామంతో మూడు సార్లు చల్లితే తెగులుని అరికట్టవచ్చు.
- జీవ పద్దతులు
- పొలంలో ఒకసారి ఇది కనపడిన తరువాత ఈ తెగులును నియంత్రించడం చాలా కష్టం.
- తెగులు సోకని నాణ్యమైన విత్తనాలను, మంచి మొలకలను నాటాలి.
- పంటల మార్పిడి తప్పనిసరి
- పొలంలో పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి.
అనుకూల వాతావరణం
తడి వాతావరణం, అకస్మాత్తుగా వానలు పడినప్పుడు తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. |
|
బక్ ఐ రాట్
ఇది ఫైటో ఫ్తోరా పారసైటికా అనే ఫంగస్ వల్ల వస్తుంది. |
 |
లక్షణాలు
అన్ని ప్రాంతాలలోనూ టమాట పంటను ఆశించే తెగులు ఇది. మొక్కలో నేలకు దగ్గరలో ఉన్న కాయలకు ఈ తెగులు తొలుత ఆశిస్తుంది. ఆకుల వంటి పచ్చ భాగాలపై తెగులు లక్షణాలు ఏమీ కనపడవు. తెగులు సోకిన మొక్కలో కాయల మీద బూడిద ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో, తడిసినట్టు ఉన్న మచ్చలు కనపడతాయి. ఈ మచ్చలు పెరుగుతున్న కొద్దీ అవి సన్నటి, వలయాకారపు, ముదురు గోధుమ లేదా లేత గోధుమ చారలుగా మారుతాయి. లేత కాయలకు తెగులు సోకినప్పుడు అవి చచ్చుబడి పోతాయి. |
 |
|
 |
మొక్కలో పాడయ్యే భాగాలు
కాయలు
తెగులు జీవిత చక్రం
చలి కాలంలో పొలంలో నిల్వ ఉన్న మొక్క భాగాలలో ఫంగస్ బతికి ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లో ఇది మొలకలను నాశనం చేస్తుంది. ఇది విడుదల చేసే జీవ కణాలు గాలి ద్వారా లేదా అకస్మాత్తుగా పడే వాన ద్వారా ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది. చలి రోజుల్లో బంగాళ దుంప, టమాట, వంకాయతో పాటు ఆ జాతులకు చెందినా అనేక ఇతర పంటలను ఈ తెగులు ఆశిస్తుంది. గ్రీన్ హౌస్ లో పెంచే టమాట పంటలో కూడా ఈ తెగులు తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. |
 |
|
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- డిఫోల్తాన్ (0.౩%) మందును మధ్యలో 10 రోజుల విరామంతో నాలుగు సార్లు చల్లితే తెగులు నియంత్రణలో ఉంటుంది.
- జీవ పద్దతులు
- పొలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా సరైన సౌకర్యాలు ఉండాలి.
- నేలకు పైన 15 – ౩0 సెంటి మీటర్ల పైన వరకు మొక్క భాగాలని కత్తిరించడం లేదా అక్కడ కాయలు లేకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే తెగులు వ్యాప్తి కాకుండా ఉంటుంది.
అనుకూల వాతావరణం
వాతావరణం పొడిగా ఉండి, ఉష్ణోగ్రత 21 – 29 డిగ్రీల సెంటిగ్రేడ్, గాలిలో తేమ 100% ఉండి, దానికి తోడు రాత్రి పూట ఉష్ణోగ్రత 7 – 15 డిగ్రీల సెంటిగ్రేడ్, పొద్దుటి వరకు మంచు లేదా సన్నటి వాన పడితే తెగులు చాలా త్వరగా విస్తరిస్తుంది. మబ్బులు పట్టిన వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగదు కాబట్టి మొక్కలోని లేత భాగాలు తడిగానే ఉంటాయి. తడి వాతావరణంలో, బలంగా వీచే గాలులు, వాన ఉంటే, ఫంగస్ జీవకణాలు 20 కిలో మీటర్ల దూరం వరకు వ్యాపిస్తాయి. |
| |
| |