శనగ పచ్చ  పురుగు

(Scientific Name :      Helicoverpa armigera)


శనగ పచ్చ  పురుగు  ఖరీఫ్ సీజనులో ఆగస్టు – అక్టోబర్ మధ్య కాలంలో వస్తుంది.  అకాల భారీ ర్షాలు  పడినప్పుడు, తేమ 70 శాతం వరకు ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.   పత్తి, కంది,  జొన్న, శనగ, టమాట, బెండ, బీన్స్, బొబ్బర్లు  పంటలను దెబ్బతీస్తుంది.  

లక్షణాలు

  • కాయ మీద స్పష్టమైన గుండ్రటి రంధ్రాలు ఏర్పడతాయి.
  • లార్వా దశలో పిల్ల పురుగు తల మాత్రం కాయలోకి తొలుచుకుని పోతుంది. మిగతా శరీరం మాత్రం బయటే ఉంటుంది.  తొలవగా ఏర్పడిన రంధ్రాల దగ్గర  గుళికల మాదిరిగా పురుగు విసర్జితాలు కనపడతాయి.
  • పిల్ల పురుగులు మెల్ల మెల్లగా మొక్క 
  • ఒక్కొక్క లార్వా కనీసం 30 నుంచి 40 కాయలు పాడుచేస్తుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు

    • కాయ,  ఆకులు, మొగ్గలు, పువ్వులు
    • లార్వాలు చిన్నగ్గా ఉన్నప్పుడు పచ్చదనాన్ని తింటాయి. కొంచెం పెరిగిన తరవాత మొక్కలోని పువ్వు భాగాలను, ఆకులను తింటాయి.

 
పురుగు జీవిత చక్రం
మొత్తం జీవిత చక్రం 40 రోజుల పాటు ఉంటుంది.

గుడ్లు: 

విడివిడిగా గుడ్లు లేత ఆకులు, పూ మొగ్గలతో పాటు, మొక్కలోని ఆయా భాగాల పై భాగం, కింది భాగంలోనూ కనపడతాయి.  ఒక ఆడ పురుగు 5౦౦ గుడ్ల వరకు పెడుతుంది. ఇవి తెలుపు నుంచి ఆకుపచ్చ రంగులో గుండ్రంగా  ఉంటాయి.  గసాల సైజులో ఉంటాయి.  4-5 రోజులలో పొదగబడతాయి.

లార్వా (పిల్ల పురుగులు) : 

సీజన్ , ఆహార లభ్యత బట్టి  14 నుంచి 20 రోజులపాటు ఈ దశలో ఉంటాయి. ఎక్కువగా పువ్వులను, మొగ్గలను ఇష్టపడుతుంది. ఆకులు కూడా తింటుంది.  

ప్యుపా  (కోశస్థ) దశ: 

ఈ దశలో  నేలలో కాని, మొక్క మొదలులోని చెత్తలో కాని గడుపుతుంది.  10 నుంచి 15 రోజుల పాటు ఈ దశలో ఉంటుంది. 

తల్లి పురుగు:
ఈ దశలో  ఆహారం తినదు.  6 నుంచి 8 రోజులపాటు ఈ దశలో ఉంటుంది. ఆడ పురుగుతో కలిసిన తరువాత గుడ్లు పెడుతుంది. మొత్తం జీవిత కాలం 40 రోజులు.

పురుగును గుర్తించడం
గుడ్లు: 
విడివిడిగా మొక్కలోని ఆయా భాగాల పై భాగం, కింది భాగంలోనూ కనపడతాయి.   తెలుపు నుంచి ఆకుపచ్చ రంగులో గుండ్రంగా  ఉంటాయి.  గసాల సైజులో ఉంటాయి.  4-5 రోజులలో పొదగబడతాయి.

లార్వా (పిల్ల పురుగులు) : 
పెరిగే తీరు, ఆశించిన పంటను బట్టి  లార్వాలు ముదురు ఆకుపచ్చ, పసుపు, గులాబీ, నారింజ,  గోధుమ, నలుపు రంగులో ఉంటాయి. రంగు ఏదైనా లేత రంగులోనే ఉంటాయి. శరీరం మీద సన్నని నూలు వంటి రోమాలు పలుచగా ఉంటాయి. పగటి పూట సులభంగా గుర్తించవచ్చు. 
చిన్నవిగా ఉన్నప్పుడు ఆకులను గీకి గీకి తింటాయి. పెరిగే క్రమంలో కాయలు, మొగ్గలు, పువ్వులను తొలుచుకుని తింటాయి. అలా తొలిచిన చోట గుండ్రటి రంధ్రాలు ఏర్పడతాయి.  ఈ  రంధ్రాల దగ్గర వాటి విసర్జితం ఉంటుంది.

ప్యుపా  (కోశస్థ) దశ: 
ముదురు గోధుమ రంగులో ఉంటుంది. నేలలో కాని, మొక్క మొదలులోని చెత్తలో కాని గడుపుతుంది
తల్లి పురుగు:
ఆడ పురుగు ముందు రెక్కలు పసుపు నుంచి నారింజ రంగులో ఉంటాయి. మగ పురుగులో ఇవి ఆకుపచ్చ నుంచి మసక గోధుమ రంగులో కనపడతాయి.  రెక్కల అంచుల వెంబడి నల్లటి చారలు ఉంటాయి. వెనుక రెక్కలు లేత పసుపులో ఉండి,  అంచుల పైన గోధుమ రంగు చారలు, మధ్యలో గుండ్రటి మచ్చలు ఉంటాయి.

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు
స్వల్ప కాలిక పంటలలో మొక్కకు ఒక లార్వా లేదా మూడు గుడ్లు, మధ్య కాలిక పంటలలో   మొక్కకు మూడు లార్వాలు  లేదా ఐదు గుడ్లు, దీర్ఘ కాలిక పంటలలో మొక్కకు ఐదు లార్వాలు  లేదా పది గుడ్లు కనపడిన వెంటనే  పురుగును అదుపు చేయడానికి తగిన నియంత్రణ చర్యలు మొదలుపెట్టాలి.

  • రసాయన పద్దతులు

 ఒక  హెక్టారుకు 2.5 లీటర్ల ఫోసలోన్ ౩5 ఇ.సి., లేదా క్వినాల్ఫోస్ 25 ఇ.సి., లేదా 2.5 కిలోల కార్బారిల్ 50 డబ్ల్యు.పి. లేదా 1.5 లీటర్ల పైరక్లోఫోస్ 50 ఇ.సి. వంటి పురుగు మందులను చల్లాలి.

  • జీవ పద్దతులు
  • పంటల మార్పిడి  (పెసర్లు, మినుములు, సోయాబీన్, ఆముదం, జొన్న, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా వేయడం)
  • ఎర పంటలుగా బంతి, బెండ వంటి పంటలు
  •  పంట అవశేషాలను తొలగించడం
  • నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించడం
  • విత్తిన 7వ, 12వ వారంలో ఎన్.పి.వి. ద్రావణాన్ని  నిర్ధారిత మొత్తంలో వాడటం
  • సాలీడు, అక్షింతల పురుగు వంటి మిత్ర పురుగులు ఉండేలా చూడటం
  • గుడ్డు దశలో వేప కషాయం చల్లడం
  • లార్వా దశలో పచ్చి మిర్చి వెల్లుల్లి కషాయం, పొగాకు కషాయం చల్లడం
  • కోశాస్థ దశలో ఉన్నవాటిని నియంత్రించడానికి వేసవి దుక్కులు
  • ఎకరానికి 10 పక్షి స్థావరాలు పెట్టడం
  • ఎకరానికి ౩ కార్డుల (60000) ట్రైకోగామా పరాన్న జీవులను వదలడం
  • వేసవి దుక్కులు
  • దీపపు ఎరలు పెట్టడం

అనుకూల వాతావరణం

  • అకాల వానలు పడినప్పుడు, తేమ 70 శాతం ఉన్నప్పుడు పురుగుకు అనుకూలం
  • నత్రజని ఎరువుల వాడకం ఎక్కువైనప్పుడు.
 
కాయ తొలుచు పురుగు

Scientific Name  :  Exelastis atomosa 

ఎక్కువగా పూత దశలో పంటను ఆశిస్తుంది. పంటకు బాగా నష్టం చేస్తుంది.  కందితో పాటు ఇతర పప్పు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.

 

లక్షణాల
కాయల పైన తొలిచినట్టు రంద్రాలు ఉంటాయి.  కాయలు, మొగ్గలు, పువ్వులు దెబ్బ తింటాయి.  కాయ లోపలి గింజలు కూడా తొలిచినట్టు ఉంటాయి. పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు మొగలు, పువ్వులు  కూడా రాలిపోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు

కాయలు, మొగ్గలు, పువ్వులు

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
కాయలు లేతగా ఉన్నప్పుడే తల్లి పురుగు కాయ లోపల విడివిడిగా గుడ్లు పెడుతుంది. అక్కడే గుడ్ల నుంచి  పిల్ల లార్వాలు బయటికి వస్తాయి. గుడ్డు దశ 4-5 రోజులు ఉంటుంది.

పిల్ల పురుగు దశ (లార్వా) :
రెండు నుంచి నాలుగు వారాల్లో పిల్ల పురుగులు పెద్దవి అవుతాయి. పెరిగిన లార్వా 7-8 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా పెరిగిన లార్వా 12 మిల్లి మీటర్ల పొడవు ఉండి, ఆకుపచ్చ గోధుమ రంగులో కనపడుతుంది.  శరీరం పైన చిన్న చిన్న వెంట్రుకల మాదిరిగా, ముళ్ళ మాదిరిగా ఉంటాయి. 14-౩0 రోజులు ఈ దశలో బతుకుతుంది.  ముందుగా కాయ పై భాగం తొలుచుకుని తిని, తరువాత మెల్ల మెల్లగా కాయను తొలిచి  రంధ్రాలను చేస్తుంది. ఒక్కొక్కసారి అప్పటికి తెరుచుకోని                   పూ మొగ్గలని కూడా తొలిచి లోపలి భాగాలను తినేస్తుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
తొలిచిన కాయ ఉపరితలం లేదా పిల్ల పురుగు చేసిన రంధ్రాలలో కానీ కోశాస్థ దశ ఉంటుంది. పైన `చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. 4-8 రోజుల పాటు ఈ దశలో గడుపుతుంది. రంగు మినహాయిస్తే, ఈ దశలో  పిల్ల పురుగు మాదిరిగానే ఉంటుంది. ఇది గోధుమ రంగులో ఉంటుంది.

తల్లి పురుగు

ఆకుపచ్చ, ముదురు రంగులో  చిన్న సైజులో ఉంటుంది. 

పురుగును గుర్తించడం
గుడ్డు దశ
:  
కాయ లోపల  ఆకు పచ్చ రంగులో గుండ్రంగా, విడివిడిగా  ఉంటాయి.  

పిల్ల పురుగు దశ (లార్వా) :
14 మిల్లి మీటర్ల  పొడవు ఉంటుంది. ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో, స్పిండీల్ మాదిరిగా ఉంటుంది. శరీరం అంతటా చిన్న చిన్న ముళ్ళ మాదిరి, వెంట్రుకల మాదిరి ఉంటాయి. వానలు పడ్డ తరువాత ఎక్కువ కనపడతాయి.

కోశస్థ దశ :
పిల్ల పురుగు మాదిరిగానే ఉంటుంది. కాయ ఉపరితలం మీద లేదా pedicel మీద గాని ఉంటుంది.

తల్లి పురుగు

సన్నగా, దాదాపు 12 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. బూడిద రంగులో, సన్నటి గుండ్రటి రెక్కలు ఉంటాయి.  ముందరి రెక్కలు రెండు గాను, వెనుక రెక్కలు మూడు గాను చీలి ఉంటాయి. మొన తేరినట్టు అంచులను కలిగి ఉంటుంది.

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

పంట  పూత దశలో లీటర్ నీటికి 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్, లేదా  2 మిల్లి లీటర్ల క్వినోల్ఫోస్ లేదా ౩ గ్రాముల కార్బారిల్  కలిపి చల్లాలి.

  • జీవ పద్దతులు
      • పక్షి స్థావరాలు
      • సాలీడు, అక్షింతల పురుగు వంటి మిత్ర పురుగులు వచ్చేలా చేయడం
      • 5%  ఎన్.ఎస్.కే.ఇ ద్రావణం చల్లడం (పిల్ల పురుగులు చిన్నగా ఉన్నప్పుడు)
      • సహజ కషాయాలు  (పచ్చి మిర్చి, వెల్లుల్లి కషాయం, పొగాకు కషాయం వంటివి)
      • దులపడం పద్ధతి - పురుగులను ఏరి  చంపి వేయడం

అనుకూల వాతావరణం
వానలు పడిన తరువాత పురుగు ఉధృతి పెరుగుతుంది.

 
కాయ తొలుచు ఈగ

Scientific Name  : Melanogromyza obtuse

ఈ పురుగు కంది, ఇతర పప్పు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.

లక్షణాలు
పురుగు ఆశించిన తొలి దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. పిల్ల పురుగు దశలో మాత్రం కాయ గోడలను తొలిచినట్టు రంధ్రాలు కనపడతాయి. పురుగు పెరుగుతున్న కొద్దీ ఈ రంధ్రాలు కూడా పెద్దవిగా మారతాయి. ఈ  రంధ్రాల నుంచే తల్లి పురుగు బయటికి వస్తుంది.
మొక్కలో  పాడయ్యే భాగాలు
కాయలు, పువ్వులు,  మొగ్గలు 

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
తల్లి పురుగు కాయ పై భాగాన్ని తొలిచి లోపల గుడ్లు పెడుతుంది. ఇవి కాయలోనుంచి తొలుచుకుని వచ్చిన సూదుల మాదిరి ఉంటాయి. ఒక్కో కాయలో కనీసం 4 గుడ్లు పెడుతుంది.  తల్లి పురుగు తన జీవిత కాలంలో 80 గుడ్ల వరకు పెడుతుంది. గుడ్డు దశ ౩ రోజులు ఉంటుంది.

పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్డు నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయ లోపలికి చొచ్చుకుపోయి లోపల ఉన్న గింజలను తిని బతుకుతాయి. పిల్ల పురుగులు కాయను నష్టపరచినట్టు పైకి ఏమీ కనపడదు. గింజ చుట్టూ ఉండే కవచం తొలచకుండా, పిల్ల పురుగు ముందుగా బాహ్య చర్మం లోపలికి చొచ్చుకుపోయి అక్కడ ఉంటుంది. తరువాత మెల్ల మెల్లగా గింజను తొలుస్తుంది. ఒక గింజను మొత్తంగా పాడు చేసేసరికి పిల్ల పురుగు తన దశ పూర్తి చేసుకుంటుంది. ఈ దశలో మొత్తంగా 6-10 రోజులు ఉంటుంది.

కోశాస్థ (ప్యుపా) దశ: :

కాయను తొలిచిన రంద్రాలలో ఈ దశను గడుపుతుంది. గింజకి ఆవల,  కాయకు లోపల 8- 12 రోజుల పాటు ఉంటుంది. ఈ దశలో ఇది గోధుమ రంగులో కనపడుతుంది.

తల్లి పురుగు

తల్లి పురుగు చిన్నగా, నల్లగా,  5 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.   లేత కాయ లేదా పువ్వు మొగ్గలలో గుడ్లు పెడుతుంది.

పురుగును గుర్తించడం
పిల్ల పురుగు (లార్వా):   

పిల్ల పురుగు తెల్లటి రంగులో ఉంటుంది. ౩ మిల్లి మీటర్ల పొడవు పెరుగుతుంది. కాళ్ళు పూర్తిగా ఏర్పడవు.  పచ్చటి గింజను తింటూ బతుకుతుంది.

తల్లి పురుగు:  
తల్లి పురుగు నల్లగా, ఈగ మాదిరిగా ఉంటుంది. కాళ్ళు బలంగా  ఉండి, ఉదర భాగం ఉబ్బినట్టు ఉంటుంది. స్పష్టమైన ఈనెలు కలిగిన రెక్కలు ఉంటాయి. రెక్కల కింది భాగం గోధుమ పసుపు రంగులో ఉంటుంది.

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • పిల్ల పురుగులను అదుపు చేయడానికి, లీటర్ నీటికి 1.5 మిల్లి లీటర్ల మోనో క్రొటోఫాస్, లేదా  2 మిల్లి లీటర్ల  డై మీతోయేట్,  తల్లి పురుగులను అదుపు చేయడానికి అయితే 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్ కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
      • సకాలంలో విత్తడం
      • సంతానోత్పత్తి జరిగే చలి కాలంలో, పురుగు వల్ల దెబ్బతిన్న కాయలను వెంటనే తొలగించడం
      • పురుగుకు సహజ శత్రువులైన Euderus agromyzae,  Euderus livid( కోశస్థ దశలో ఇవి అదుపు చేస్తాయి)  వంటి వాటిని ప్రోత్సహించడం 

అనుకూల వాతావరణం

తేమ ఎక్కువగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
 
కాండం తొలుచు ఈగ

Scientific Name   :  Ophiomyia phaseoli

కాండం తొలుచు ఈగ కందితొ పాటు మినుములు, పెసర్లు, సోయాబీన్ వంటి పంటలకు సోకుతుంది.

లక్షణాలు

    • పంట లేతగా ఉన్నప్పుడే ఈ పురుగు ఆశిస్తుంది.
    • కాండం తెరిచి చూసినప్పుడు, గుల్ల మాదిరిగా కనపడుతుంది. లోపల పురుగు విసర్జించిన పదార్థాలు కూడా కనపడతాయి.
    • ఆకులు రాలిపోతుంటాయి. మొక్క  కూడా వదలినట్లు కనపడుతుంది.
    • లేత మొక్కలు పసుపు రంగులోకి మారతాయి.
    • కాండంలో  పిల్ల పురుగులు, ప్యూపా ఉన్నప్పుడు అది ఉబ్బినట్టు కనపడుతుంది.
    • లేత మొక్క పై కాండం దెబ్బతిని, వదలినప్పుడు, మొక్క చనిపోతుంది.
    • వడలిన కాండాన్ని దగ్గరగా  పరిశీలించినప్పుడు, అడుగు భాగంలో   పిల్ల పురుగులు, ప్యూపా స్పష్టంగా కనపడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు

కాండం

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
కాండంలో లేతగా ఉన్న భాగాలలో తల్లి పురుగు గుడ్లు పెడుతుంది.
పిల్ల పురుగు దశ (లార్వా):
గుడ్ల నుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలి భాగాలలోనికి చొచ్చుకుపోయి వాటిని తింటూ బతుకుతుంది.
కోశస్థ దశ (ప్యూపా):
ఈ దశను  కూడా కాండం లోపలి భాగాలలోనే గడుపుతుంది.
తల్లి పురుగు:
తల్లి పురుగు  నల్లగా మెరుస్తూ ఉంటుంది. 2 మిల్లి మీటర్ల వరకు పొడవు ఉంటుంది.  మొక్క లేదా కాండం   పై భాగాలలో గుడ్లు పెడుతుంది.

పురుగును గుర్తించడం
పిల్ల పురుగులు (లార్వా): 
చిన్నగా, పసుపు రంగులో ఉంటాయి.

తల్లి పురుగు:
చిన్నగా నల్లటి ఈగ మాదిరిగా ఉంటుంది. 

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • ఎక్కువ విత్తనాలు విత్తడం
      • విత్తన శుద్ధి  (కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బో సల్ఫాన్ లేదా 4 గ్రాముల థయో మితాక్సాం కలిపి విత్తన శుద్ధి చేయాలి)
      • విత్తనం మొలకెత్తిన తరువాత హెక్టార్ కి  5౦౦ మిల్లి   లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 70% డబ్ల్యు.జి. చల్లాలి.
    • జీవ పద్దతులు
    • 5% ఎన్. ఎస్.కే. ఇ. ద్రావణం చల్లడం
 
మారుక  (కాయ తొలిచే మచ్చల పురుగు)

Scientific Name   :  Maruca testulalis

ముందుగా వేసిన  కంది పంట పై ఈ పురుగు ప్రభావం ఎక్కువ.  పురుగు మొత్తం జీవిత కాలం

౩. వారాలు. కందితో పాటు  బీన్స్, ఇతర పప్పు ధాన్యాల పంటలను ఆశిస్తుంది.  

లక్షణాలు
పిల్ల పురుగు మొక్కలోని ఆకులను, మొగ్గలను, కాయలను గూడు మాదిరిగా మారుస్తుంది. ఈ గూడు లోపలనే ఆయా భాగాలను తింటూ బతుకుతుంది.   మొగ్గ, పిందె, కాయలపై పురుగు తొలిచిన రంధ్రాలు ఉంటాయి.   
మొక్కలో  పాడయ్యే భాగాలు
మొగ్గ, పిందె, కాయలు  
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
గుడ్లు గుండ్రంగా, పసుపు పచ్చగా ఉంటాయి. మొక్కలోని ఆయా భాగాలలో వాటి అంచుల పైన తల్లి పురుగు చిన్న చిన్న గుంపులుగా ఈ గుడ్లను పెడుతుంది.
పిల్ల పురుగు (లార్వా దశ):
పిల్ల పురుగు కాయను ఒకవైపు నుంచి తొలిచి లోపలి వెళ్లి, అక్కడ పక్వానికి వచ్చిన  గింజలను తింటుంది. పురుగు తొలిచిన రంధ్రం వెలుపల దాని విసర్జితం పెద్దమొత్తంలో కనపడుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ :
కాయ గూడు లేదా నేల ఉపరితలం మీద ఈ దశను గడుపుతుంది.
తల్లి పురుగు
తల్లి పురుగు ముందు రెక్కలు గోధుమ రంగులో ఉంటాయి. రెక్కల మీద వలయాకారపు మచ్చలు ఉంటాయి. మొక్కలోని ఆయా భాగాల పైన గుడ్లను పెడుతుంది. 

పురుగును గుర్తించడం
పిల్ల పురుగు:
ఇది 14 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. శరీరం తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పైన ఉపరితలం మీద అక్కడక్కడా కనిపించీ, కనిపించని నలుపు మచ్చలు వరుసలుగా ఉంటాయి.  కోశస్థ దశకు కొన్ని రోజుల ముందు ఈ మచ్చలు కనిపించవు.

తల్లి పురుగు:
తల్లి పురుగు రెక్కలు ముదురు గోధుమ రంగులో  ఉంటాయి. రెక్కల మధ్య నిడివి 20 మిల్లి మీటర్లు ఉంటుంది. ముందు రెక్కల అంచు వెంబడి గుండ్రటి చారలు ఉంటాయి. తెల్లని వెనుక రెక్కలు ముదురు గోధుమ రంగు అంచులను కలిగి ఉంటాయి.

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

పువ్వు, మొగ్గ దశలోనే లీటర్ నీటికి 2.5 మిల్లి లీటర్ల క్లోరోఫైరిఫాస్ లేదా  2 మిల్లి లీటర్ల క్వినాల్ఫాస్ లేదా 0.75 మిల్లి లీటర్ల నోవాలురాన్ లేదా 0.75 మిల్లి లీటర్ల స్పైనోసోడ్ లేదా 1 మిల్లి లీటర్ లాందా సయలోతోరిన్ ను, 1 మిల్లి లీటర్ దైక్లోరోవాస్ కలిపి, వారానికి ఒకసారి చల్లాలి.

  • జీవ పద్దతులు
  • అనువైన (మధ్య  రకపు) వంగడాలు వాడటం
  • ముందుగానే విత్తడం  (జూలై తొలివారంలో)
  • మిత్ర పురుగులను ప్రోత్సహించడం  (చీమలు, గొల్ల భామ వంటివి)
  •  కషాయాలు  చల్లడం
 
పేను బంక

Scientific Name  Aphis craccivora

పేను బంక  మొత్తం జీవిత కాలం 8.౩. రోజులు. ఆడ, మగ పురుగులు కలవకుండానే పునరుత్పత్తి జరుగుతుంది. తల్లి పురుగు నేరుగా పిల్లలను పెడుతుంది. వాన బాగా వస్తే ఈ పురుగు దానంతట అదే అదుపులో ఉంటుంది.    కంది, పప్పు ధాన్యాలు, బీన్స్, పత్తి, మిరప, బెండ, వంగ, దోస, నిమ్మ  పంటలను ఆశిస్తుంది. 

లక్షణాలు
ఇవి రసం పీల్చే పురుగులు. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు రెండూ కూడా లేత ఆకులు, రెమ్మ నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దానివల్ల ఆకులు ముడత పడి పోతాయి. మొగ్గలు రావు. మొక్క జీవం  కోల్పోయి వడలిపోయినట్లు మారుతుంది.  పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మరింత తొందరగా జరుగుతుంది.  
పూవుల  నుంచి తియ్యని జిగట వంటి పదార్థం కారడం వల్ల కింది ఆకులపై నల్లని బూజు పెరుగుతుంది.  ఈ తేనె చుట్టూ నల్ల చీమలు చేరడం గమనించవచ్చు.   

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు , మొగ్గలు, పువ్వులు, మొక్కలోని ఇతర లేత భాగాలు  

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
గుడ్లు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. పసుపు నుంచి ఆకుపచ్చ రంగులో కనపడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ:
పిల్ల పురుగులు  మొత్తంగా 4  రకాలుగా రూపాంతరం చెంది పెద్ద పురుగులుగా మారతాయి. ఈ దశలో 8-12 రోజులు గడుపుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ కూడా ఉండదు.

 

తల్లి పురుగు
తల్లి పురుగు తన 6-7 రోజుల పునరుత్పత్తి కాలంలో 14-17 పిల్లలను పెడుతుంది. పిల్లలు చిన్నప్పుడు కూడా తల్లి పురుగు మాదిరిగానే ఉంటాయి.

పురుగును గుర్తించడం
పిల్ల పురుగు:
ఈ దశలో పిల్లలు అచ్చంగా  తల్లి పురుగు మాదిరే ఉంటాయి. అయితే తల్లి పురుగు కన్నా చిన్నవిగా ఉండి,  బూడిద రంగులో కనపడతాయి.  చురుకుగా ఉండవు. స్థబ్దుగా ఉంటాయి. రెక్కలు ఉండవు.
తల్లి పురుగు:
పసుపు ముదురు ఆకుపచ్చ లేదా నల్లటి రంగులో, గుండ్రంగా, మెరుస్తూ ఉంటాయి. రెక్కలు ఉండవు.  పొట్ట పైన సన్నటి వెంట్రుకల మాదిరి ఉంటాయి. ఇవి 2 మిల్లి మీటర్ల వరకు పొడవు ఉంటాయి. కొన్నింటికి రెక్కలుంటాయి కాని పూర్తిగా రెక్కల మాదిరిగా ఉండకుండా, సన్నగా ఉంటాయి.  పొలంలో మొదట రెక్కలు ఉన్న పురుగులు చేరి, తరువాత అవి రెక్కలు లేని పిల్లలను కంటాయి. వీటి సంతతి పొలమంతా విస్తరిస్తుంది.  


పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటర్ నీటికి 2 మిల్లి లీటర్ల  డై మీతోయేట్ లేదా  2 మిల్లి లీటర్ల  హోస్ఫామీదోన్ లేదా 2 మిల్లి లీటర్ల  మాలాథియాన్ కలిపి చల్లాలి.

  • జీవ పద్దతులు
  • పొగాకు కషాయం,  ఇతర సహజ కషాయాలు చల్లడం
  • మిత్ర పురుగులు (అక్షింతల పురుగు, సాలీడు వంటివి) వచ్చేలా చూడటం

అనుకూల వాతావరణం
పొడి వాతావరణం, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితులు ఈ పురుగు వ్యాప్తికి అనుకూలం. అయితే వానలు ఎక్కువగా ఉంటే పురుగు ఉధృతి చాలామట్టుకు తగ్గుతుంది.

 
ఎర్ర గొంగలి పురుగు 

Scientific Name  Amsacta albistriga (Red hairy caterpillar) and Spilosoma oblique (Bihary hairy caterpillar)

కంది, ఆముదం వంటి పంటలను ఆశిస్తుంది. అయితే కంది పంటలో ఈ పురుగు చేసే నష్టం చాల స్పష్టంగా కనపడుతుంది.  జూన్ – ఆగష్టు మధ్య కాలంలో ఈ పురుగు సోకుతుంది.

లక్షణాలు

    • ఆకులు, లేత పువ్వుల మీద  పిల్ల పురుగుల విసర్జితాలు  కనపడతాయి. మొక్క శాఖీయ దశలో ఈ పురుగు ఎక్కువ నష్టం చేస్తుంది.
    • పిల్ల పురుగులు ఆకుల కింది భాగాన్ని తినేస్తాయి. దాంతో కేవలం కాండం, రెమ్మలు మాత్రమే కనపడతాయి.
    • పురుగుల ఉధృతి ఎక్కువ అయితే, పంట మేకలు, గొర్రెలు మేసినట్టు కనపడుతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, లేత పువ్వులు

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
ఆకుల కింది  భాగంలో తల్లి పురుగు 50 నుంచి, 100 గుడ్లను పెడుతుంది.  ఎర్ర గొంగళి పురుగు మొక్కలోని ఆయా భాగాలలో కానీ, మొక్క పక్కన ఉన్న మట్టి బెడ్డల పైన కాని గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఇవి  గుండ్రంగా ఉంటాయి. ఒక గుంపులో ౩00 గుడ్ల వరకు ఉండవచ్చు.  

పిల్ల పురుగు (లార్వా) దశ

ఈ దశలో దాదాపు నెల రోజులు గడుపుతుంది. లేత గోధుమ రంగులో ఉంటాయి. పెరిగిన కొద్దీ ముదురు రంగుకు మారతాయి. ఒక్కొక్కటిగా కదులుతూ ఆకులను తినేస్తాయి.

కోశాస్థ (ప్యుపా) దశ
ఈ దశని నేల లోపల గడుపుతుంది. చుట్టూ సిల్క్ లాంటి గూడు కట్టుకుని ఉంటుంది. పిల్ల పురుగు దశలో ఉన్న వెంట్రుకలు ఈ దశలో కనిపించవు.

తల్లి పురుగు

కొన్ని రకాల గొంగళి పురుగుల ఏడాదిలో ఒక తరాన్ని ముగిస్తాయి. ఎర్ర గొంగళి పురుగులు మాత్రం ౩0-40 రోజుల జీవితక కాలంతో కొన్ని తరాల పాటు బతుకుతాయి.

పురుగును గుర్తించడం
పిల్ల పురుగు (లార్వా) దశ

పిల్ల పురుగుల శరీరం పైన ఎరుపు గోధుమ రంగులో వెంట్రుకలు ఉంటాయి. ఇవి 50మిల్లి మీటర్ల వరకు పొడవు ఉంటాయి. తల వెనుక భాగంలో దట్టంగా, ముద్దగా ఉన్న వెంట్రుకలను చూసి వీటిని గుర్తించవచ్చు.  

ఈ దశలో ఎర్ర గొంగళి పురుగు నల్లటి తలను కలిగి ఉంటుంది. శరీరం లేత గోధుమ రంగులో ఉంటుంది. శరీరం పైన పసుపు రంగు  వెంట్రుకలు ఉంటాయి. వెంట్రుకల అంచులు మాత్రం నల్లగా ఉంటాయి.

తల్లి పురుగు

ఎర్ర గొంగలి పురుగుల్లో తల్లి పురుగు రెక్కలు తెల్లటి రంగులో ఉంటాయి. వాటి పైన నల్లటి మచ్చలు ఉంటాయి.

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

పిల్ల పురుగుల పైన దట్టమైన వెంట్రుకలు ఉంటాయి  కాబట్టి పై నుంచి చల్లే రసాయన మందులు ఎటువంటి ప్రభావం చూపవు. చల్లిన మందు శరీరానికి చేరదు.

  • జీవ పద్దతులు
  • వేప కషాయం చల్లడం  (పిల్ల పురుగు దశలో)
  • వేప ఆధారిత పురుగు మందులు ((పిల్ల పురుగు దశలో)
  •  మిత్ర పురుగులు, పక్షులు
  • లోతైన వేసవి దుక్కులు  (కోశాస్థ దశలో)
  • దీపపు ఎరలు (తొలకరి వానల తరువాత)
  • పురుగులను ఏరి చంపడం  (కిరోసిన్ లో వేసి)
  • ఎర పంటలు (జిల్లెడు, అడవి ఆముదం వంటి పంటల మొక్కలు గట్ల పైన నాటడం) 
  • పంట పొలం చుట్టూ చిన్న గోతులు తవ్వి వాటిలో బూడిద పోయడం వల్ల పిల్ల పురుగులను చనిపోతాయి.
 
ఫుజెరియం విల్ట్

ఈ తెగులు ఫుసేరియం ఒడుం అనే ఫంగస్ వల్ల వస్తుంది.

లక్షణాలు
మొక్క పసుపు రంగులోకి మారి,  క్రమంగా వడలిపోవడం  ఈ తెగులు ప్రధాన లక్షణం. విత్తిన నెల రోజుల తరువాత,  పూత దశ, మొగ్గ ఏర్పడే దశలో ఈ తెగులు కనపడుతుంది.  తెగులు సోకిన మొక్క  భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. క్రమంగా వడలుతూ,  చివరికి మొక్క పూర్తిగా ఎండిపోతుంది.  కాండంలోని కణజాలం గోధుమ రంగుకు మారినప్పుడు తెగులు ముదిరినట్లు భావించవచ్చు.  మొక్క ఎండిపోవడం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ జరుగవచ్చు.  ఎండిపోవడం అన్నది పాక్షికంగా జరిగితే,  వేళ్ళ పక్క భాగాన తెగులు కనపడుతుంది. వేళ్ళ పై భాగాన తెగులు సోకితే పూర్తిగా వడలి ఎండిపోతుంది.  విత్తిన 65 – 70 రోజుల నుంచి వడలడం ప్రారంభమై,  మొక్క శాఖీయ దశ వచ్చే నాటికి (180 – 210రోజుల నాటికి) గరిష్ట స్థాయికి చేరుతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
వేళ్ళు, కాండం  
తెగులు జీవిత చక్రం
తెగులుకు కారకమయ్యే ఫంగస్ నేలలోఉంటుంది. నేలలో  ఉష్ణోగ్రత 20 – 25 డిగ్రీల సెంటిగ్రేడ్, తేమ 10 – 12% వరకు ఉన్నప్పుడు చురుకుగా మారుతుంది.  ఈ జీవి పంట అవశేషాలపై కుళ్ళిన పదార్థం ఆధారంగా బతుకుతూ ఉన్నప్పుడు తెగులు ఉధృతి ఎక్కువవుతుంది.  ఈ జీవి నేలలో మూడేళ్ళపాటు బతుకుతుంది.  పంటలో నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు,  వానాకాలంలో వచ్చే వరదల సమయంలో మొక్క వేళ్ళపై పురుగులు, ఇతర క్రిములు చేసే రంధ్రాల ద్వారా  ఈ జీవి మొక్క లోపలికి పోయి, తెగులుని వ్యాపింప చేస్తుంది.  
తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • విత్తన శుద్ధి  -   కిలో విత్తనాలకు ఒక గ్రాము కార్బండైజిం 50 డబ్ల్యు,పి., ౩ గ్రాముల  థైరాం 80 డబ్ల్యు.పి. కలిపి విత్తన శుద్ధి చేయాలి.
      • తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు , లీటరు నీటికి ఒక గ్రాము కార్బండైజిం 50 డబ్ల్యు,పి కలిపి నేలపై చల్లాలి.
  • జీవ పద్దతులు
  • తెగులు నిరోధక వంగడాలను ఎంచుకోవడం
  • కిలో విత్తనాలకు 10 గ్రాముల ట్రైకోడేర్మా హర్జానియం లేదా ట్రైకోడేర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి.

అనుకూల వాతావరణం

తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తెగులు పెరుగుతుంది.  
 
కాండం కుళ్ళు తెగులు

ఈ  తెగులు ఫైటోఫ్తోరా ద్రెశ్లర్ అనే ఫంగస్ వల్ల వస్తుంది.

లక్షణాలు
లేత మొక్కలకు తెగులు సోకినప్పుడు ౩ రోజులలో చనిపోతాయి. మురుగు నీరు నిల్వ, భూమిలో సాంద్రత ఎక్కువగా వుండే పంట పొలాల్లో తెగులు ఎక్కువగా వస్తుంది. లేత మొక్కలలో కిరీటం ఆకారంలో తెగులు మచ్చలు కనపడతాయి. అవి క్రమేపి ఎండ పడిపోతాయి. పెరిగిన మొక్కలలో  తెగులు సోకినప్పుడు తొలుత నీటిలో తడిసిన మచ్చలుగా కనపడతాయి. తరువాత అవి మొక్కకు దెబ్బలు తగిలినట్టుగా కనపడతాయి.
ఒక్కోసారి, తెగులు సోకినప్పుడు మొక్కలలో కాండం కుళ్ళిన, ఆకులు కుళ్ళిన తెగులు లక్షణాలు కనపడతాయి.  నేల పైన కాండం దిగువన గోధుమ లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. రానురాను ఇవి ప్రధాన కాండం, కొమ్మలు వంటి భాగాలకు కూడా వ్యాపిస్తాయి. ఈ దశలో అవి గాలికి కూడా రాలిపోయే స్థితిలో ఉంటాయి.  తెగులు ఇంకా ముదిరినప్పుడు, కాండం ఉబ్బుతుంది. సోకిన భాగం మెత్తగా మారుతుంది. క్రమేపి ఈ భాగాలు ఎండిపోతాయి.  అయితే తెగులు సోకిన మొక్క వేళ్ళ భాగాలు మాత్రం ఆరోగ్యకరంగానే కనపడతాయి. దెబ్బతిన్న భాగాలు గుండ్రటి గాయాలుగా ఉంటాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క మొత్తం ఎందిపోయినట్టు మారుతుంది. 

మొక్కలో  పాడయ్యే భాగాలు
వేళ్ళు, కాండం 
తెగులు జీవిత చక్రం
నీళ్ళు, సాంద్రత ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ తెగులుకు కారకమయ్యే ఫంగస్ బతుకుతుంది. అక్కడే వృద్ధి చెందుతూ, పునరుత్పత్తి జరుపుతూ, మొక్కల వేళ్ళలోనికి తెగులును వ్యాప్తి చేస్తుంది.  పైన తెలిపిన నేలలు మొక్క ఎదుగుదలకు అనుకూలం కావు. ఇలాంటి నేలల్లో మొక్కలకు రోగాలు రావడం ఎక్కువ.  21 – 25 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతకు ముందరి వారంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షం కురిసిన వాతావరణ పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం. 


తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • విత్తన శుద్ధి  - కిలో విత్తనాలకు ౩ గ్రాముల మేతాలాక్సిల్ ౩5 డబ్ల్యు.ఎస్ కలిపి విత్తనాలను శుద్ధి చేయాలి.
  • జీవ పద్దతులు
  • పంట పొలాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి.
  • తెగులు నిరోధక వంగడాలను వాడాలి.

అనుకూల వాతావరణం
నీరు నిల్వ ఉన్న పంట పొలాలు, అధిక తేమ ఉండే నేలల్లో  తెగులు వ్యాప్తికి కారకమయ్యే ఫంగస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. 

 

బాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు  
ఈ  తెగులు జాన్తోమోనాస్ కామ్పెత్రిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుంది

లక్షణాలు
ఆకులపై  గోధుమ రంగులో చిన్న చిన్న మచ్చలు, వాటి చుట్టూ పసుపు రంగు వలయం కనపడడం ఈ తెగులు వచ్చిందనడానికి సూచన. రాను రాను ఈ మచ్చలు కలిసిపోయి, పెద్ద మచ్చలుగా మారుతాయి.  ప్రధాన కాండం, కొమ్మల మీద గరుకైన, ముదురు గోధుమ రంగు మచ్చలు  ఆయా ఆకారాలలో, సైజులలో కనపడుతాయి. తెగులు ఎక్కువగా ఉన్న మొక్కలలో కొమ్మలు తొందరగా ఎండిపోతాయి. తెగులు సోకినా చోటనే విరిగిపోతాయి.

       
మొక్కలో  పాడయ్యే భాగాలు

ఆకులు, కాండం, కొమ్మలు 

తెగులు జీవిత చక్రం
ఈ తెగులు జాన్తోమోనాస్ జాతికి చెందిన బాక్టీరియా వల్ల వస్తుంది .  పసుపు రంగులో ఉండే ఈ రోగ కారకాలు నేలలో కుళ్ళిన సేంద్రియ పదార్థాల మీద బతుకుతుంది. జాన్తోమోనాస్ కామ్పెత్రిస్ ఫంగస్ కేవలం కంది పంటలో మాత్రమె తెగులును వ్యాపింప చేస్తుంది.  ఇది విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది.


తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • లీటరు నీటికి 0.25 గ్రాముల స్త్రేప్టోసైక్లిన్ కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
  • ఎక్కువ తేమ రాకుండా ఉండేందుకు, తగినంత గాలి ప్రసరించే రీతిలో  మొక్కల మధ్య సరైన దూరం ఉండేలా చూసుకోవాలి.

అనుకూల వాతావరణం
తెగులు సోకడానికి ప్రత్యేక అనుకూల పరిస్థితులు అంటూ ఏమీ లేవు. ఇది ఎప్పుడైనా రావచ్చు.

 
స్టెరిలిటి మొజాయిక్ వైరస్ తెగులు   Sterility Mosaic disease

ఈ  తెగులు స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది.

లక్షణాలు
తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు పువ్వులు, మొగ్గలు లేకుండా ఎండిపోయినట్టు, చిన్న చిన్న ఆకులతో ఉండే మొక్కలు కనపడతాయి.  ఇది అసేరియా కజాని అనే వైరస్ పురుగుల వల్ల వస్తుంది. ఈ పురుగులు చిన్నగా, గులాబి రంగులో, స్పిండిల్ ఆకారంలో ఉంటాయి. ఆకుల కింది భాగంలోని పదార్థాన్ని తింటూ బతుకుతాయి.  గాలి ద్వారా ఈ వైరస్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపిస్తుంది. 
తెగులు సోకినప్పుడు మొక్క ఆకులపై  పచ్చటి మచ్చలు ఏర్పడతాయి. శాకీయ దశలో తెగులు సోకినప్పుడు మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది.  మొక్క కొంత పెరిగిన తరువాత తెగులు సోకితే మొక్క ఎదుగుదల పాక్షికంగా తగ్గుతుంది. ఇలాంటి మొక్కల నుంచి వచ్చే విత్తనాలు రంగు లేకుండా కృశించి  ఉన్నట్టు కనపడతాయి. మామూలు విత్తనాలతో పోలిస్తే ఇవి 20% బరువు తక్కువ ఉంటాయి. తెగులు బాగా సోకిన మొక్కలలో ఎదుగుదల పూర్తిగా నిలిచిపోతుంది. ఆకులు కూడా చిన్న సైజులోనే ఉంటాయి. వాటి మీద తేలికపాటి,. ముదురు ఆకుపచ్చ మచ్చలు కనపడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు,  ఇతర శాకీయ భాగాలు
తెగులు జీవిత చక్రం
తెగులుకు కారకమయ్యే వైరస్ మొక్కలోని శాకీయ మొగ్గతొ పాటు,  ఎదిగే ఇతర భాగాలలో  ఉంటుంది. 10-25 డిగ్రీలు, 25 – ౩5 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య, గాలిలో తేమ 6౦%   వరకు ఉన్నప్పుడు ఇది పుంజుకుంటుంది.


తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • లీటరు నీటికి 2.5 మిల్లి లీటర్ల డైకోఫాల్ 18.5 . సి., లేదా 2 మిల్లి లీటర్ల ఆక్సి డేమీటాన్ మీతైల్ లేదా 1.7 మిల్లి లీటర్ల  డై మీథోయేట్ ౩0 .సి. కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
  • మొక్కలలో పచ్చదనం కోల్పోవడం మొదలైన వెంటనే వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి.
 
సేర్కో స్పోరా ఆకు మచ్చ తెగులు

ఈ  తెగులు సేర్కొస్పోరా అనే ఫంగస్ వల్ల వస్తుంది

లక్షణాలు
ఆకులు, మొక్కలోని ఇతర లేత భాగాలపై ఈ ఫంగస్ మచ్చలను కలుగచేస్తుంది.  తెగులు సోకినా ఆకుల ఉపరితలాన త్రిభుజాకార మచ్చలు కనపడతాయి. చాలా అరుదుగా ఉపరితలానికి  వ్యాపిస్తుంది.  మామూలుగా మచ్చలు విడివిడిగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని మచ్చలు కలిసిపోయి ఉంటాయి. ఇట్లా కలిసిపోయిన  మచ్చల సైజు 15 x 5 మిల్లి మీటర్ల వరకు ఉంటుంది. తొలి దశలో మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఒక్కొక్కసారి కాండానికి కూడా తెగులు సోకుతుంది. తెగులు సోకిన ఆకులు ఎండిపోవడం జరుగుతుంది.  తెగులు సోకిన తొలి లక్షణాలు అక్టోబర్ నెలలో  ఆకులు, లేత కొమ్మలు వంటి భాగాలపై కనపడుతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, మొగ్గలు, ఇతర లేత భాగాలు

 తెగులు జీవిత చక్రం
మొక్క పూత దశలో ఈ తెగులు సోకుతుంది.  మామూలుగా నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో ఇది వస్తుంది.  మొగ్గ వికసించే దశలో మొదలై, క్రమేపి విడతలుగా వ్యాప్తి చెందుతుంది. జొన్న, సజ్జ వంటి పంటలకు కూడా ఇది సోకుతుంది. 25 డిగ్రీల చల్లని ఉష్ణోగ్రత, తేమ ఎక్కువగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.  దీర్ఘ కాలిక వంగడాలలో ఈ తెగులు సర్వ సాధారణం.  

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి ఒక గ్రాము మాన్కోజేబ్ 75 డబ్ల్యు.పి లేదా ఒక గ్రాము కార్బెండైజిం 50 డబ్ల్యు.పి కలిపి చల్లాలి. 

  • జీవ పద్దతులు

అనుకూల వాతావరణం

తెగులు  27 – 28 డిగ్రీల నుంచి ౩6 – ౩7 డిగ్రీల  ఉష్ణోగ్రత వద్ద,  47% తేమ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో  ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.  తెగులు సోకిన ఆకుల మీదనే దానికి కారణమయ్యే ఫంగస్ బతుకుతుంది.
 
ఆల్టర్ర్నేరియా  ఆకుమచ్చ తెగులు

ఈ  తెగులు ఆల్టర్నేరియా ఆల్టర్నేటా అనే ఫంగస్ వల్ల వస్తుంది.

లక్షణాలు
ఆకులపై తొలుత చిన్న సైజులో గుండ్రటి గాయాల వంటి మచ్చలు కనపడతాయి. తెగులు ఎక్కువవుతున్న కొద్దీ ఇవి మొక్కలోని మొగ్గలు, పైకి కనపడే ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి.  రాను రాను మచ్చలు కలిసిపోయి పెద్దగా మారుతాయి. తెగులు సోకిన కొమ్మల నుంచి  ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.  కొమ్మలు కూడా ఎండి పోతాయి.

       
మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, కొమ్మలు

తెగులు జీవిత చక్రం
త్వరిత గతిన వ్యాప్తి చెందే ఫంగస్ ఇది. ఫంగస్ సమూహం సమతలంగా ఉండి., ఊలుతో కప్పబడినట్లు  దారపు పోగుల వలె ఉంటుంది.  ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వంగడాల రకాన్ని బట్టి తెగులు ప్రభావం ఉంటుంది. తెగులు సోకిన విత్తనాలు రంగు కోల్పోయి, చిన్నగా మారుతాయి. వానలు పడిన తరువాత తెగులు ఉధృతి ఎక్కువవుతుంది.


తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి ఒక గ్రాము మాన్కోజేబ్ 75 డబ్ల్యు.పి లేదా ఒక గ్రాము కార్బెండైజిం 50 డబ్ల్యు.పి కలిపి చల్లాలి.

  • జీవ పద్దతులు

అనుకూల వాతావరణం
ఆలస్యంగా విత్తిన పంటలో ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.  తెగులు ఆలస్యంగా సోకితే మొగ్గలు, విత్తనాలు కూడా దెబ్బ తింటాయి. వేడి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు తొందరగా వ్యాపిస్తుంది.

 
ఆకు తుప్పు తెగులు

ఈ  తెగులు ఉరిడో కజాని అనే ఫంగస్ వల్ల వస్తుంది.

లక్షణాలు
ఆకుల కింది భాగాలలో ముదురు గోధుమ రంగులో కాలినట్టు గాయాలు ఉంటాయి.  తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

తెగులు జీవిత చక్రం
తెగులుకు కారక మయ్యే జీవి ఫోటో సెన్సిటివ్. ఇది నిరంతరం జీవ కణాలను విడుదల చేస్తుంది. కాంతి, వాన, గాలి, మబ్బు పెట్టిన ఆకాశం వంటి ప్రతీ పరిస్థితిలోనూ జీవ కణాలు విడుదల అవుతాయి. వ్యాప్తి కూడా చెందుతాయి. నీరు ఉన్నంత వరకు జీవ కణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. జీవ కణాలు విడుదల అయిన 8 గంటలలోనే ఆకులలోపలికి చొచ్చుకుపోతాయి. తొందరగా మొలకెత్తే వంగడాలు ఈ తెగులును తట్టుకుంటాయి.  

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి 2 గ్రాముల మాంకోజేబ్ 75 డబ్ల్యు.పి. కలిపి చల్లాలి.

  • జీవ పద్దతులు
  • పంటను ఒత్తుగా విత్తకూడదు. రాలిపోయిన ఆకులని తీసివేయాలి
  • బీన్స్ పంటకు దగ్గరగా కంది పంటను విత్తకూడదు.

అనుకూల వాతావరణం
ఒత్తుగా ఉన్న పంట, తడి లేక పోవడం, వాన కొద్దిగా పడిన పరిస్థితులు, గాలి, మబ్బులు పట్టిన వాతావరణం తెగులు వ్యాప్తికి అనుకూలం. ఇదే పరిస్థితుల్లో జీవ కణాలు విడుదల కావడం, వ్యాప్తి చెందడంతో పాటు తరువాతి తరం జీవ కణాలు ఉత్పత్తి కావడం కూడా జరుగుతుంది.