జొన్న – పురుగులు

 షూట్ ప్లై ( Scientific Name :   Atherigona soccata)

ఇది జూలై – అక్టోబర్ మధ్య కాలంలో వస్తుంది.  జొన్న, మొక్క జొన్న, గోధుమ, చిరు ధాన్యాల పంటలను ఆశిస్తుంది.

లక్షణాలు
పిల్ల పురుగు ఆకుల కింది భాగంలో పాకుతూ, అలాగే ఆకు చివరి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి లేత మొక్క కాండాన్ని తొలిచి ఎదిగే భాగాన్ని పాడు చేస్తుంది.  పిల్ల పురుగు కుళ్ళిన పదార్ధం మీద బతుకుతుంది. నష్టం ఈ కింది లక్షణాల ద్వారా కనపడుతుంది.  రోగం సోకిన భాగంలో చెడు వాసన వస్తుంది.  ఆ భాగం సులభంగా ఊడి వస్తుంది.  తరువాత  వచ్చే మొలకలకు కూడా రోగం వ్యాపిస్తుంది. మొక్కలో 60%  దెబ్బ తింటుంది.
మొక్కలో  పాడయ్యే భాగాలు
కాండం

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
మొక్క మొలకెత్తిన తరువాత వచ్చే మూడో, నాలుగో అకుల ఉపరితలంలో గుడ్లు ఉంటాయి. ఇవి ఒకటి నుంచి ౩ రోజులలో పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు పసుపు రంగులో ఉంటాయి. గుడ్ల నుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగులు మెల్లగా ఆకుల వెనుక భాగానికి చేరతాయి. ఆకు పొరలు, మధ్య ఈనెల వెంబడి తిరుగుతూ  ఉంటాయి.  ఆకు కింది భాగంలో కొరికి తిని పాడు చేస్తాయి. దాని వల్ల మొక్క ఎండిపోతుంది.  ఈ దశలో పురుగు 6 – 10 రోజుల పాటు గడుపుతుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను కాండంలోనే గడుపుతుంది. వారం రోజుల పాటు ఈ దశలోనే ఉండి, తరువాత రెక్కల పురుగుగా మారుతుంది.
తల్లి పురుగు

రెక్కల  పురుగు చిన్నగా నల్లగా ఉంటుంది. ఆకుల  పైన  మధ్య భాగంలో విడివిడిగా, తెల్లటి గుడ్లను పెడుతుంది. ఒక్కో ఆడ పురుగు తన  జీవిత కాలంలో ౩0 గుడ్లను పెడుతుంది. పురుగు తన జీవిత చక్రాన్ని 17 – 20 రోజులలో పూర్తి చేస్తుంది. 

పురుగును గుర్తించడం

గుడ్డు దశ

గుడ్లు తెల్లగా ఉంటాయి. సిగరెట్ లేదా బల్లపరుపుగా ఉన్న బోటు మాదిరిగా ఉంటాయి. బయటికి రెక్కల మాదిరి చొచ్చుకువస్తాయి.  ఇవి 2 – ౩ రోజులలో గుడ్లు పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
          పెరిగిన పిల్ల పురుగులు పాలిపోయిన పసుపు రంగులో ఉంటాయి.  10మిల్లిమీటర్లపొడవుఉంటుంది 

కోశాస్థ దశ (ప్యుపా)
          ఈ దశను కాండంలో గడుపుతుంది.

తల్లి పురుగు

తల్లి పురుగు ౩ మిల్లి మీటర్లు ఉంటుంది.  చిక్కటి బూడిద రంగులో ఉండి,  ఇండ్లలో తిరిగే ఈగ మాదిరి కనపడుతుంది. ఆడ పురుగు ఉదరం మీద ఆరు ముదురు మచ్చలు రెండు వరుసలలో ఉంటాయి. మగ పురుగులో ఈ మచ్చలు నాలుగే ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • విత్తే సమయంలో, హెక్టారుకు 2.5 కిలోల ఫోరేట్ 10%,  లేదా కార్బోఫురాన్ ౩% గుళికలను చల్లాలి.     
  • విత్తిన తరువాత, లేదా విత్తిన రెండో వారంలో,  0.07 % ఎండో సల్ఫాన్, లేదా 0.0005 % సైపర్ మేత్రిన్ లేదా 0.5 కిలోల కార్తాప్ హైడ్రో క్లోరైడ్ లేదా 0.5 కిలోల ట్రయజోఫాస్ , వారానికి రెండు సార్లు చల్లాలి.
  • 0.2% కార్బారిల్ లేదా 0. 0౩% డై మీథోఎట్ చల్లాలి
  • కిలో విత్తనాలకు 10 గ్రాముల కార్బోఫురాన్ 50% ఎస్.పి. కలిపి విత్తన శుద్ధి చేయాలి.  
  • జీవ పద్దతులు
  • మామూలుగా హెక్టారుకు వాడే 10 కిలోల విత్తనానికి బదులు 1`2 కిలోల విత్తనాన్ని వాడాలి. విత్తిన నాలుగు వారాల తరువాత ఒత్తుగా ఉన్నచోట మొక్కలను పీకివేయాలి.  ఈ పురుగు 4-5 వారాల వయస్సు ఉన్న మొక్కలను మాత్రమే ఆశిస్తుంది.
  • సకాలంలో విత్తాలి. ముందుగా విత్తితే పురుగు బాధ తక్కువగా ఉంటుంది. ఆలస్యంగా విత్తితే పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  • పురుగు సోకిన మొక్కలను పీకిపారవేయాలి.
  • రోగ నిరోధక వంగడాలు వాదాలి.
అనుకూల వాతావరణం
పురుగు లేత మొక్కలను ఆశిస్తుంది. ఆలస్యంగా విత్తిన పంటలపై  పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా జూలై – అక్టోబర్ మధ్య కాలంలో పురుగు తీవ్రత ఉంటుంది. మబ్బులు పట్టిన వాతావరణంలో పురుగు ఉధృతి ఎక్కువవుతుంది.  రబీలో ముందుగా నాటిన పంటలను ఆశిస్తుంది కాబట్టి  విత్తడం కొంచం ఆలస్యం చేస్తే మంచిది

Sorghum stem borer కాండం తొలిచే పురుగు (Scientific Name  : Chilo partellu)

ఇది జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో జొన్నను ఆశిస్తుంది.   జొన్న, మొక్క జొన్న, చిరు ధాన్యాలు, చెరుకు వంటి పంటలను కూడా   దెబ్బ తీస్తుంది.

లక్షణాలు
విత్తిన  నెల రోజుల నుంచి పంట కోత దశ వరకు ఈ పురుగు ఆశిస్తుంది.  జొన్న, మొక్క జొన్న పంటలను ఆశించే ప్రదాన పురుగులలో ఇది ఒకటి.  పిల్ల పురుగు దశలో ఇది కాండంలోని కణజాలం తింటూ, ఆ క్రమంలో లేత మొక్కలలోని ప్రదాన భాగాలను నాశనం చేస్తుంది. దీనివల్ల  ఆకుల వలయాలలో రంధ్రాలు ఏర్పడతాయి.  కుళ్ళిన భాగంలో ఎటువంటి వాసన ఉండదు.  రోగం సోకినప్పుడు పంట దిగుబడి బాగా తగ్గుతుంది.  జొన్న చొప్ప నాణ్యత కూడా తగ్గుతుంది. మొత్తం మీద 60 – 70% పంటను పాడు చేస్తుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు

ఆకులు,కాండం

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
ఒక్కో ఆడ పురుగు ఆకుల కింద భాగంలో దాదాపు ౩00 గుడ్లను పెడుతుంది. ఇవి 2 – 6 రోజులలో పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు పాలిపోయిన తెలుపు రంగులో ఉండి, దానిపై  నాలాటి మచ్చలు ఉంటాయి.  తల గోధుమ రంగులో ఉంటుంది. కాండం కానుపు దగ్గర రంధ్రం చేసి లోపలికి పోయి అక్కడ బతుకుతుంది. చలి కాలంలో స్తబ్దుగా, శుప్తవస్తలో ఉంటుంది. ఒక్కో మొక్క మీద నాలుగు పిల్ల పురుగులు ఉంటాయి. వేసవిలో పిల్ల పురుగు 28 నుంచి 50 రోజుల వరకు బతుకుతుంది. చలి కాలంలో 19౩ రోజుల పాటు ఈ దశలో ఉంటుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను కాండం లోపలే గడుపుతుంది. వాతావరణ పరిస్థితిని బట్టి వారం నుంచి 15 రోజులలో రెక్కల పురుగుగా మారుతుంది.
తల్లి పురుగు
రెక్కల  పురుగు మధ్యస్థ సైజులో, గడ్డి రంగులో ఉంటుంది. ఆడ పురుగు ఆకుల కింది భాగంలో, మధ్య ఈనే వద్ద  200 వరకు  సమతలాకార గుడ్లను పెడుతుంది.  ప్రురుగు మొత్తం జీవిత కాలం ౩0 నుంచి 40 రోజులలో పూర్తి చేస్తుంది.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు సమతలంగా, ఒకదాని మీద ఒకటి ఒరుసుకుని ఉంటాయి. గుడ్లు గుంపులు గుంపులుగా ఉంటాయి. 

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు సిలిండర్ ఆకారంలో ఉండి,  పసుపు గోధుమ రంగులో కనపడతాయి. తల గోధుమ రంగులో ఉంటుంది.  శరీరం మీద నల్లటి మచ్చలు ఉంటాయి. మొత్తంగా 25 మిల్లి మీటర్ల మేర పొడవు ఉంటుంది. ఈ దశలో 28 నుంచి ౩5 రోజుల పాటు గడుపుతుంది.  చలి కాలంలో స్తబ్దుగా ఉంటుంది.  పూర్తిగా పెరిగిన పిల్ల  పురుగు  కాండం లోపల  కోశాస్థ దశకు  వెళ్లక ముందే, ఆ దశ తరువాత  బయటికి రావడానికి అవసరమైన రంధ్రం చేసుకుంటుంది. 
కోశస్థ దశ (ప్యుపా)
ఈ దశను కాండం లోపలే గడుపుతుంది.  ఈ దశలో ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది.  శరీరం వెనుక భాగంలో  6 వలయాలు ఉంటాయి. ఆ దశను 7 నుంచి 10 రోజుల పాటు గడుపుతుంది.
తల్లి పురుగు

తల్లి పురుగు మధ్యస్థ దశలో ఉంటుంది.  గడ్డి రంగులో కనపడుతుంది. ముందు రెక్కల వెనుక భాగంలో నల్లటి మచ్చాలు ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • విత్తిన నెల రోజుల నుంచి, ప్రతి 15 రోజులకు ఒక సారి లెక్కన మూడు సార్లు, కార్బారిల్ 0.1% లేదా ఎండో సల్ఫాన్ 0.౦7%   చల్లాలి.
    • పంట మొలకెత్తిన 25 – ౩0 రోజుల తరువాత, ఒకసారి ఎండో సల్ఫాన్ 4% లేదా 10% కార్బారిల్ లేదా 4% కార్తాప్ హైడ్రో క్లోరైడ్ గుళికలను చల్లాలి. మళ్ళీ కొన్ని రోజుల తరువాత ఇంకో సారి చల్లాలి.  
  • జీవ పద్దతులు
    • పంట అవశేషాలను నాశనం చేయడం – పిల్ల పురుగులు ఈ అవశేషాల మీద బతుకుతాయి కాబట్టి వాటిని నాశనం చేయాలి.
    • ఎక్కువ మోతాదులో విత్తణాలు నాటాలి.  పురుగు సోకిన మొక్కలను వెంటనే గుర్తించి ఏరి పారేయాలి.
    • రోగ నిరోధక వంగడాలను ( సి.ఎస్.హెచ్. 7, 8, ఎస్.పి.వి. 17, 19, 29, 58, ఐ, సి. ఎస్.వి 197, 745, 8810౩ వంటి రకాలు) వాడాలి.
    • పురుగును తినే సహజ శత్రువులు వచ్చేలా చేయడం
      • గుడ్డు దశలో  - ట్రైకోగ్రామ్మా చిలోనిస్
      • లార్వా దశలో – కోతిసియా ఫ్లవిపెస్, బ్రాకొన్ చినేన్సిస్
      •  ప్యుపా దశలో – జాన్తో  పింప్లా పంక్టాటా,  టెట్రాసిచుస్ అయ్యార
అనుకూల వాతావరణం
పిల్ల పురుగు  పంట అవశేషాలపై బతుకుతుంది. సీజనల్ గా వచ్చే రోగం ఇది. మామూలుగా జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో వస్తుంది.  రబీ, వేసవి పంటలో  పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 

మిడ్జ్ (Scientific Name  : Contarinia sorghicola)

ఇది జొన్నతో పాటు ఇతర చిరు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.
లక్షణాలు
పిల్ల పురుగులు పెరుగుతున్న గింజలను తిని పాడు చేస్తాయి. దానివల్ల గింజలు కృశించి పోతాయి. పురుగు తీవ్రత  ఎక్కువగా ఉన్నప్పుడు గింజల దిగుబడిపై ప్రభావం ఉంటుంది. అలాంటప్పుడు నష్టం 20-50% వరకు ఉండవచ్చు.  పురుగు సోకినప్పుడు నష్ట లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

పుష్ప గుచ్చాన్ని ఒత్తినప్పుడు ఎర్రటి ద్రవం కారితే, వాటిలో పిల్ల పురుగులు ఉన్నట్టు భావించాలి. దెబ్బతిన్న గింజల మీద గుండ్రటి రంధ్రాలు ఉంటాయి.  పుష్ప గుచ్చాల కింద భాగంలో కోశాస్త దశలో చేసిన గుల్లలు కనపడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
గింజలు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఒక్కో తల్లి పురుగు దాదాపు 75 గుడ్లను పెడుతుంది. పుష్ప గుచ్చాల కింద ఇవి ఉంటాయి. 2-౩ రోజులలోనే పొదగబడతాయి. తల్లి పురుగు ఒక్క రోజు మాత్రమె బతుకుతుంది.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు పెరిగే కాయ  గింజను తిని బతుకుతుంది.  9 నుంచి 11 రోజులలో ఈ దశలు పూర్తి చేసుకుంటుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను కాయ గిమ్జలలోనే గడుపుతుంది. మూడు రోజుల పాటు ఈ దశలో ఉంటుంది. 
తల్లి పురుగు
రెక్కల  పురుగు పుష్ప గుచ్చం కొన నుంచి బయటకు వస్తుంది.. తెల్లటి ప్యుపా కవచాన్ని తొలుచుకుని వస్తుంది. గుడ్డు నుంచి రెక్కల పురుగు వరకు  మొత్తం 14 – 16 రోజులలో జీవిత దశలు పూర్తవుతాయి. ఒక ఏడాది కాలంలో 9 – 12 తరాలు పూర్తి చేసుకుంటాయి.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు సిలండర్ ఆకారంలో ఉంటాయి.  0.1 X 0.4 మిల్లి మీటర్ల సైజులో ఉంటాయి. 2 – ౩ రోజులలో గుడ్లు పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు తొలుత రంగు ఉండదు. పూర్తిగా పెరిగిన పిల్ల పురుగులు ముదురు నారింజ రంగులో ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ  దశను పుష్ప గుచ్చంలో గడుపుతుంది.  ఈ దశలో పురుగు చిన్నగా ఉంటుంది. రెక్కల పురుగు బయటికి వచ్చే సమయంలో గుల్లగా మారిన గూడును వదిలివేస్తుంది. 

తల్లి పురుగు

రెక్కల పురుగు చాలా చిన్నగా ఉంటుంది.  1.౩ – 1.6 మిల్లి మీటర్ల మేర పొడవు ఉంటుంది. దీని తల పసుపు రంగులో కనపడుతుంది. శరీరం, గొంతు భాగం మెరుస్తూ నారింజ ఎరుపులో ఉంటుంది.  రెక్కలు బూడిద రంగులో, పారదర్శకంగా ఉంటాయి. 

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • మొలకెత్తిన తరువాత, హెక్టారుకు లీటరు ఎండో సల్ఫాన్ ౩5 ఇ.సి., లేదా ఫోసాలేన్ లేదా మాలాథియాన్ లేదా 2 కిలోల కార్బారిల్ 50 డబ్ల్యు.పి. చల్లాలి. 4, 5 రోజుల తరువాత మళ్ళీ ఒకసారి చల్లాలి.  
  • ఫోసలేన్ 4%, లేదా ఎండో సల్ఫాన్ 4% లేదా మాలాథియాన్ 5% లేదా కార్బారిల్ 10% లేదా హెక్టారుకు ౧౨ కిలోల క్వినాల్ఫాస్ 1.5%   కూడా చల్లవచ్చు.
  • జీవ పద్దతులు
  • పంట వ్యర్ధాలను తగులబెట్టడం – దీనివల్ల వాటిలో ఉండే పిల్ల పురుగులు చనిపోతాయి.
  • ఆయా రకాల వంగడాలను,  ఒకే సమయంలో పుష్పించే రీతిలో, ఒకే తేది నాడు  విత్తడం
  • వానా కాలంలో కాస్త ముందుగానే విత్తడం
  • రోగ నిరోధక వంగడాలు (ఐ.సి.వి. 197, 745, 8801౩, పి.జే 890 వంటివి) ఎంచుకోవడం
  • సహజ శత్రువులైన  పురుగులను ప్రోత్సహించడం (టెట్రా స్టికాస్ కోయంబెతో రెంసిస్)   
అనుకూల వాతావరణం
పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెంది పురుగు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లోనూ తన ప్రభావాన్ని చూపుతుం ది.

గులాబి రంగు పురుగు (Scientific Name : Sesamia inferens)

ఇది జొన్న,  మొక్క జొన్న, వరి, గోధుమ, చెరుకు, గడ్డి జాతి మొక్కలను ఆశిస్తుంది.   
లక్షణాలు
పిల్ల పురుగులు కాండంలోకి చొచ్చుకుపోయి  ప్రధాన శాఖను నాశనం చేస్తుంది. దానివల్ల మొగ్గలు, కంకులు దెబ్బ తింటాయి.  ఒక్కో కాండంలో ఐదు వరకు పిల్ల పురుగులు ఉంటాయి. ఒక్కో పిల్ల పురుగు చాలా మొక్కలని పాడుచేస్తుంది. ఆకుల ముడతలలో  చతురస్రాకారంలో పొడవాటి రంధ్రాలు  ఏర్పడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
మొగ్గలు, కంకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఒక్కో ఆడ పురుగు 100 – 150 గుడ్లు పెడుతుంది. ఆకుల మడతలలోనూ,  కాండంలోనూ  రెండు, మూడు వరుసలలో  ఇవి కనిపిస్తాయి. వారం నుంచి 12 రోజుల లోపల గుడ్లు పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు దశ  25 నుంచి 54 రోజుల పాటు ఉంటుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను కాండం లోపల గడుపుతుంది.  8 నుంచి 12 రోజుల లోపల రెక్కల పురుగు బయటికి వస్తుంది.,

తల్లి పురుగు

రెక్కల  పురుగు రాత్రి పూట సంచరిస్తుంది.  ఆకుల కింది భాగంలో గుడ్లు పెడుతుంది.  6 – 7 వారాల లోపల ఒక జీవిత చక్రం పూర్తి చేసుకుంటుంది.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు తెల్లగా, అర్ధ చంద్రాకారంలో ఉండి,  0.7 మిల్లి మీటర్ల వ్యాసార్ధం కలిగి ఉంటాయి.  పై నుంచి కిందకు పొడవునా స్పష్టమైన చారలు వంటివి ఉంటాయి.  పొదగబడే సమయం దగ్గర పడుతున్న కొద్దీ గుడ్లు తొలుత గోధుమ రంగుకు, తరువాత బూడిద రంగుకు మారుతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పూర్తిగా          పెరిగిన పిల్ల పురుగు 20 – 26 మిల్లి మీటర్ల పొడవు  ఉంటుంది.  పాలిపోయిన పసుపు రంగులో ఊదా, గులాబి రంగు కలిసినట్టు కనపడుతుంది. తల మాత్రం ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పైన గుల్ల ఉండదు. ప్యుపా 18 మిల్లి మీటర్ల పొడవుతొ, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల ప్రాంతంలో ఊదా రంగు కలిసినట్లు ఉంటుంది.
తల్లి పురుగు

తల్లి పురుగు మధ్య రకం సైజులో, గడ్డి రంగులో ఉంటుంది. ముందు రెక్కలపై సన్నటి ముదురు గోధుమ చారలు ఉంటాయి.  వెనుక రెక్కలు, గొంతు భాగం తెల్లగా ఉంటుంది.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • పంట మొలకెత్తిన 25 – ౩0 రోజుల తరువాత, ఒకసారి ఎండో సల్ఫాన్ 4% లేదా 10% కార్బారిల్ లేదా 4% కార్తాప్ హైడ్రో క్లోరైడ్ గుళికలను చల్లాలి. మళ్ళీ కొన్ని రోజుల తరువాత ఇంకో సారి చల్లాలి.  
  • లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్ కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
  • చనిపోయిన మొగ్గలను, రోగం సోకిన భాగాలను తీసి నాశనం చేయాలి.  

అనుకూల వాతావరణం

 

ఇయర్ హెడ్ బగ్ (Scientific Name  :  Calocoris angustatus)

జొన్నతో పాటు  మొక్క జొన్న, ఇతర చిరు ధాన్యాల పంటలను ఆశిస్తుంది.  
లక్షణాలు
పిల్ల పురుగులు, తల్లి పురుగులు పాల దశలో ఉన్నప్పుడు లేత గింజల నుంచి  రసం పీల్చేస్తాయి. దీనివల్ల,  గింజలు గుల్ల బారుతాయి. గింజల పరిమాణం కూడా తగ్గుతుంది. పురుగు తిన్న భాగాలలో తొలుత ఎరుపు రంగు మచ్చలు కనపడుతాయి. ఈ మచ్చలు క్రమంగా నలుపు రంగుకు మారుతాయి.  గింజలు నల్లగా మారి చివరకు ఎండిపోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
గింజలు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తల్లి పురుగు మొక్కలోనే పువ్వు భాగాల కింద లేదా పుష్ప గుచ్చాల నడుమ గుడ్లని పెడుతుంది. ఒక్క ఆడ పురుగు మొత్తంగా 150 – 200 గుడ్లను పెడుతుంది. ప్రతి పుష్ప గుచ్చంలో ఒకటి నుంచి 16 గుడ్ల వరకు పెడుతుంది.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల  పురుగు దశ 10 నుంచి 16 రోజుల పాటు ఉంటుంది.

కోశస్థ దశ (ప్యుపా)
ఈ దశ ఉండదు.
తల్లి పురుగు
ఆకుల మధ్య నుంచి కంకులు వచ్చే సమయంలోనే పురుగు సోకుతుంది.  కొద్ది వ్యవధిలోనే పురుగుల సంఖ్య పెరిగిపోతుంది
గుడ్డు దశ నుంచి రెక్కల పురుగు దశ వరకు  అన్ని దశలు పూర్తి కావడానికి 15 – 17 రోజులు పడుతుంది. ఒక పంట సీజనులో పురుగు రెండు తరాలను పూర్తి చేసుకుంటుంది.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు  నీలం రంగులో ఉండి,  సిగరెట్ ఆకారంలో ఉంటాయి.  10 రోజులలో గుడ్లు  పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగుల శరీరం తేలికపాటి నారింజ రంగులో  ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ వాటి శరీరం ఆకుపచ్చ రంగుకు మారుతాయి.
కోశాస్థ దశ (ప్యుపా)

                   ఈ దశ ఉండదు.

తల్లి పురుగు

తల్లి పురుగులు సన్నగా పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.  పొడవైన కాళ్ళు ఉంటాయి.  మొత్తం మీద ఒక సెంటి మీటరు పొడవు ఉంటుంది. చాలా చురుకుగా ఎగురుతూ ఉంటాయి.

 

పురుగునియంత్రణ–నివారణ పద్దతులు

  • రసాయన పద్దతులు
  • కంకులు రావడం కనిపించగానే,  ఎకరానికి 8 – 10 కిలోల కార్బారిల్ చల్లాలి.  ఒక వారం తరువాత మరోసారి  చల్లాలి.  అవసరమయితే,  లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్, లేదా 2.5 మిల్లి లీటర్ల ఫోసాలేన్ కలిపి చల్లాలి.   
  • జీవ పద్దతులు
    • తొలి వానల తరువాత వెంటనే విత్తాలి
    • చిన్నగా ఉండే కంకుల రకాలను ఎంచుకోరాదు.
    • కిరోసిన్ కలిపిన నీళ్ళలో పురుగు సోకిన కంకులను ముంచితే, పిల్ల పురుగులు చనిపోతాయి. 
అనుకూల వాతావరణం


ఎర్ర గొంగళి పురుగు (Scientific Name:  Amsacta albistriga and A. moorei)

జొన్న,  మొక్క జొన్న, పత్తి, ఆముదం, వేరు శనగ, పప్పు ధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది.

లక్షణాలు

ఆకులు, లేత పువ్వుల మీద  పిల్ల పురుగుల విసర్జితాలు  కనపడతాయి. మొక్క శాఖీయ దశలో ఈ పురుగు ఎక్కువ నష్టం చేస్తుంది. పిల్ల పురుగులు ఆకుల కింది భాగాన్ని తినేస్తాయి. దాంతో కేవలం కాండం, రెమ్మలు మాత్రమే కనపడతాయి.

  • పురుగుల ఉధృతి ఎక్కువ అయితే, పంట మేకలు, గొర్రెలు మేసినట్టు కనపడుతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, లేత పువ్వులు 

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
తల్లి పురుగు 50 నుంచి 100 గుడ్ల సమూహాలుగా, దాదాపు 1000 గుడ్ల వరకు పెడుతుంది. ౩ – 4 రోజులలో ఇవి పొదగబడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :

నల్లగా ఉండే పిల్ల పురుగులు  ఆకుల కింద భాగాన్ని 4 – 5 రోజుల పాటు తినేస్తాయి.  10 రోజుల లోపుల ఇవి బూడిద గోధుమ రంగుకు మారుతాయి. మెల్ల మెల్లగా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కపైకి పోతూ పంటను నాశనం చేస్తాయి. 40 – 50 రోజుల లోపుల పిల్ల పురుగులు పెద్దవవుతాయి. 

కోశాస్థ (ప్యుపా) దశ:  
పూర్తిగా పెరిగిన పిల్ల పురుగులు రాబోయే వానల  కోసం ఎదురు చూస్తాయి. ఈ సమయంలో వానలు పడక పొతే ఈ పురుగులు కోశస్థ దశకు వెళ్ళలేవు కనుక చనిపోతాయి.  నేలలో తేమ లేకపోతే ఈ పిల్ల పురుగులు కోశస్థ దశకు వెళ్ళలేవు. ఇలా తేమ ఉంటే, పిల్ల పురుగులు గట్ల వద్ద,  నీడ ఉన్న స్థలాలలో, చెట్ల కింద, నేలని తొలుచుకుని లోపల 10 – 20 సెంటి మీటర్ల మేర బొరియలను చేస్తాయి.  వచ్చే ఏడాది వరకు అందులోనే ఉంటాయి. అంటే అక్టోబర్ – నవంబర్ నుంచి జూలై – ఆగష్టు వరకు ఈ దశలో ఉంటాయి.
తల్లి పురుగు
జూన్ – జూలైలో వానలు పడగానే, రెక్క పురుగు బయటికి వస్తుంది.  గుంపులు గుంపులుగా ఇవి  వస్తాయి.  బయటికి రాగానే ఆడ, మగ పురుగులు కలుస్తాయి.  తరువాత 2 -  ౩ రోజుల పాటు ఆడ పురుగులు  గుడ్లు పెడతాయి.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు క్రీం కలర్ లేదా మెరిసే పసుపు రంగులో ఉంటాయి.  మొక్క లోని లేత భాగాలు లేదా నేల లోపల లేదా మట్టి బెరుసులు లేదా రాళ్ళు లేదా అప్పుడప్పుడు పక్కనున్న పచ్చదనం మీద ఈ గుడ్లు కనపడతాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. తల కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. శరీరం పైన దట్టంగా వెంట్రుకలు ఉంటాయి. శరీరం రెండు వైపులా నలుపు, ఎరుపు కలగలిపిన మచ్చలు ఉంటాయి.

కోశాస్థ దశ (ప్యుపా)

వెంట్రుకలతొ కూడిన గూడు లోపల ఈ దశను గడుపుతుంది.

తల్లి పురుగు

రెక్కల పురుగు మధ్యస్థ సైజులో ఉంటుంది. ముందు రెక్కలు తెలుపు రంగులో  ఉండి, వాటిపై గోధుమ రంగు మచ్చలు, చారలు ఉంటాయి. వెనుక రెక్కలు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి. వాటి మీద నల్లటి మచ్చలు ఉంటాయి.  తల మీద ఎర్రటి చారతొ పాటు రెక్కల అంచుల వెంబడి పసుపు రంగు చారలు కనపడతాయి. 

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • పొలాల చుట్టూ కందకాలు తవ్వి, వాటిలో మిథైల్ పారతియాన్ చల్లాలి
  • తొలి తరం పిల్ల పురుగుల నియంత్రణకు ఎకరానికి  10 కిలోల క్వినాల్ఫాస్ లేదా మిథైల్ పారతియాన్ చల్లాలి.
  • పెరిగిన పిల్ల పురుగుల నియంత్రణకు, లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డై మీథోఎట్ లేదా 1.6 మిళి లీటర్ల మోనో క్రోటోఫాస్ చల్లాలి.
  •  10 కిలోల రైసు బ్రాన్, కిలో బెల్లం, లీటరు క్వినాల్ఫాస్ లేదా ౩50 మిల్లి లీటర్ల  మీథోమిల్కు తగిన మోతాదులో నీటిని కలిపి విషపు గుళికలని తయారుచేసి,   సాయంత్రం వేళలలో పొలంలో పెట్టాలి
  • జీవ పద్దతులు
    • పంట కోత తరువాత లోతుగా దున్నితే, ప్యుపా దశలో ఉన్న పురుగులు చనిపోతాయి.
    •  వానలు పడిన 48 గంటల లోపల రాత్రి 7 – 11 గంటల సమయంలో మంటలు వేస్తె అప్పుడప్పుడే ఎగురుతూ బయటికి వచ్చే రెక్కల పురుగులు అందులో పడి చనిపోతాయి.
    • గుడ్ల గుంపును , పిల్ల పురుగులని ఏరి నాశనం చేయాలి.
    • కంది, ఆముదం వంటి పంటలను  ఎర పంటలుగా వేయాలి.,
    • జిల్లెడు, అడవి ఆముదం వంటి పంటల మొక్కలను పంట గట్ల మీద నాటి పిల్ల పురుగులను అడ్డుకోవడం
    • మిత్ర పురుగులు, పక్షులు వచ్చేలా చూడడం (టాక్నిదిస్, ఎక్సోరిస్టా సివిలైడ్స్, స్తుర్మియా ఇంకాస్పిక్యుఎల్ల వంటివి) 
అనుకూల వాతావరణం
ఎర్ర నేలలు ఈ పురుగుకు అనుకూలమైనవి.  ఖరీఫ్ తొలి రోజుల్లో, వానలు పడిన కొద్ది రోజులలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 
 

జొన్న – తెగుళ్ళు

ఆంత్రాక్ నోస్

ఇది కొల్లెటోట్రైకేం గ్రామినికోలా అనే ఫంగస్ వల్ల వస్తుంది.  జొన్నతో పాటు చిరు ధాన్యాల పంటలను ఆశిస్తుంది.  
లక్షణాలు

  • ఫంగస్ వల్ల ఆకుల మీద, కాండం మీద మచ్చలు ఏర్పడతాయి. 
  • ఆకుల పైన, కింద మధ్యలో తెల్లటి బిందువులతో కూడిన చిన్నటి ఎరుపు రంగు మచ్చలు కనపడతాయి. 
  • తెల్లటి మచ్చల మీద నలుపు రంగు చిన్న చుక్కలు కూడా ఉంటాయి. ఇవి ఫంగస్ జీవ కణాలు.
  • మచ్చలన్నీ కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారుతాయి. దానివల్ల ఆకు దెబ్బతిన్నట్టు కనపడుతుంది. ఆకుల మధ్య భాగంలో పొడవాటి, నలుపుతో కూడిన ఎరుపు లేదా ఊదా  రంగు మచ్చలు కూడా కనపడతాయి. కాండం మీద గుండ్రటి గాయాల మాదిరి మచ్చలు ఉంటాయి. 
తెగులు సోకిన కాండం కోసి చూస్తె, అక్కడక్కడ రంగు కోల్పోయిన లక్షణాలు కనపడతాయి. 

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం

తెగులు జీవిత చక్రం
తెగులుకు కారకమయ్యే విత్తనాల మీద, పంట ఆవశేషాల మీద బతుకుతుంది.  అనేక రకాల గడ్డి జాతి పంటల ( జాన్సన్ గ్రాస్, సూడాన్ గ్రాస్)తొ పాటు,  మొక్క జొన్న, బార్లీ, గోధుమ తదితర పంటల మీద ఈ ఫంగస్ జీవిస్తుంది.  గాలి ద్వారా వ్యాపిస్తుంది.

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • విత్తన శుద్ధి  - కిలో విత్తనాలకు ౩ గ్రాముల కాప్తాన్ లేదా థైరాం కలిపి విత్తన శుద్ధి చేయాలి.
    • 0. 25% మాన్కోజేబ్ లేదా 0. 1%  కార్బెండైజిం పంట మీద చల్లాలి
  • జీవ పద్దతులు
    • తెగులు సోకిన పంట అవశేషాలను, ఫంగస్ కు ఆతిధ్యమిచ్చే ఇతర ఆతిదేయులను తొలగించాలి 
    • తగులు నిరోధక వంగడాలని (ఎస్.పి.వి 162, సి. ఎస్.వి. 17వంటి రకాలు) వాడటం

అనుకూల వాతావరణం
తరచుగా వానలు పడే సమయం, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తెగులు ఉధృతి ఎక్కువ.  పంట అవశేషాలలో ఫంగస్ జీవ కణాలను విడుదల చేస్తుంది. పంటల మార్పిడి చేస్తే తెగులు నివారించవచ్చు.  పంటల మార్పిడి లేకుండా,  భూమిని పై పైన దున్నినప్పుడు   తెగులు వచ్చే అవకాశం ఎక్కువ. కలుపు నియంత్రణ చేస్తూ కూడా తెగులును అరికట్టవచ్చ

తుప్పు తెగులు

 

ఇది పక్సినియా పర్పురియా అనే ఫంగస్ వల్ల వస్తుంది.  జొన్న, మొక్క జొన్న. చెరుకు, చిరు ధాన్యాలు, గడ్డి జాతి మొక్కలను కూడా ఆశిస్తుంది.   
లక్షణాలు
పంట అన్ని దశలలోనూ ఈ తెగులు సోకుతుంది. అయితే సాధారణంగా మొక్క రెండు నెలల వయస్సు  ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది.  ముందుగా కింద ఉన్న ఆకుల మీద తెగులుకు సంబంధించిన తుప్పు లక్షణాలు కనపడతాయి. ఆకు కింది భాగంతో పోలిస్తే, పైన ఈ తుప్పు మచ్చలు ఎక్కువగా  ఉంటాయి. మొక్క పెరుగుతున్న కొద్దీ తెగులు ఎక్కువవుతుంది. క్రమేపీ అది ఇతర లేత అక్కులకు కూడా వ్యాపిస్తుంది.  పైన ఉండే రెండు, మూడు ఆకులు తప్పితే, మిగతా ఆకులన్నింటికీ ఈ తెగులు వ్యాపిస్తుంది.

తుప్పు మచ్చలు చిన్నగా, ఎరుపు, గోధుమ రంగులో, గుండ్రంగా ఉంటాయి. ఒక్కోసారి గుడ్డు మాదిరి ఆకారంలో కూడా ఉంటాయి.  మచ్చలు 1 - 2 మిల్లి మీటర్ల వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. వంగడం రకాన్ని బట్టి ఈ మచ్చల రంగు ఉంటుంది.  మచ్చలు ఆకుల కింద భాగంలో గుంపులు గుంపులుగా కనపడతాయి.  తెగులు పెరుగుతున్న కొద్దీ మచ్చలు కలిసిపోతాయి.  సీజను చివర్లో మచ్చలు ఎరుపు, గోధుమ రంగు నుంచి నలుపు రంగు గాయాల మాదిరి కనపడతాయి. క్రమంగా తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు సోకి రోగం బారిన పడిన మొక్కలను దూరం నుంచి కూడా గమనించవచ్చు.
   

మొక్కలో  పాడయ్యే భాగాలు           
ఆకులు
తెగులు జీవిత చక్రం
పంట పెరిగిన తరువాత ఎక్కువగా వచ్చే తెగులు ఇది.  దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ తెగులు కనపడుతుంది.  పంటకు బాగా నష్టం చేస్తుంది. సీజను చివరన తెగులు వస్తే, గింజల దిగుబడి నష్టం కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే మొదట్లోనే తెగులు వస్తే, మొక్క ఎదుగుదల ఆగడం వల్ల పంట నష్టం ఎక్కువగానే ఉంటుంది.  ఫంగస్ కు కారకమయ్యే జీవి అనేక రకాల జీవిత చక్రాలను పూర్తి చేస్తుంది. దేశం లోపల ఈ ఫంగస్ వ్యాప్తికి కారణమేమిటనేది ఇంకా తేలలేదు.
తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • పంట మీద 0. 25% మాన్కోజేబ్  చల్లాలి.
  • హెక్టారుకు 25 కిలోల సల్ఫార్ చల్లాలి
  • జీవ పద్దతులు
    • ఫంగస్ వ్యాప్తికి దోహదం చేసే ప్రత్యామ్నాయ అతిధి( అక్సాలిస్ కార్నికులేతా) లేకుండా చేయాలి.
    • తెగులు నిరోధక వంగడాలను (సి.ఎస్.హెచ్. 5, సి.ఎస్.వి 17 వంటివి) వాడాలి.  
    • అనుకూల వాతావరణం
చల్లటి వాతావరణ పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం.

శుగరీ తెగులు
ఇది క్లావిసేప్స్ సోర్ఘీ లేదా స్ఫాసిలియా సోర్ఘీ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఎక్కువగా జొన్న పంటలోనే వస్తుంది.    
లక్షణాలు

  • విడివిడిగా కంకులకు ఈ  తెగులు సోకుతుంది.
  • తెగులు సోకిన కంకి భాగాల నుంచి చిక్కటి జిగురు లాంటి ద్రవం కారుతూ ఉంటుంది. ఇది చీమలను,  పురుగులను ఆకర్షిస్తుంది. ఆయా భాగాల చుట్టూ ఇలా చీమలు, క్రిములు చేరడం ఈ తెగులు సోకిందనడానికి ప్రధాన సూచిక.
  • తెగులు సోకిన కంకి ఫంగస్ వల్ల నల్లగా మారుతుంది. తెగులు సోకిన గింజ  తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో,  లేత గోధుమ రంగులో   తిన్నగా లేదా  వంకరగా ఉన్న గట్టి  కణజాలంగా మారుతుంది.
  • తెగులు  సోకిన మొక్క మొదట్లో,  నేల అడుగు భాగాన తెల్లటి మచ్చలు కనపడతాయి. పై నుంచి కారిన జిగట ద్రవపు చుక్కలతో ఈ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. 

మొక్కలో  పాడయ్యే భాగాలు
కంకులు

తెగులు జీవిత చక్రం
నేలలో ఉండే ఫంగస్ ఉత్పత్తి చేసే జీవ కణాలు గాలి ద్వారా, వాన ద్వారా, పురుగుల ద్వారా విస్తరిస్తాయి.  

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • విత్తన శుద్ధి  - కిలో విత్తనాలకు 4 గ్రాముల కాప్తాన్ లేదా థైరాం కలిపి విత్తనాలను శుద్ధి చేయాలి.
  • కంకులు కనపడగానే ( 5 – 10% పూత దశలో) జిరాం లేదా 0.2%  మాన్కోజేబ్ చల్లాలి.  తరువాత మరోసారి 50% పూత దశలో చల్లాలి. ఇంకా అవసరం అయితే వారం రోజుల తరువాత మరోసారి చల్లాలి.
  • విత్తన ఉత్పత్తి  క్షేత్రాలలో ­ప్రోపికోనజోల్ లేదా టేబుకోనాజోల్ వంటి మందులు వాడి తెగులును నియంత్రించడం అన్నది ఖర్చు తక్కువ పని.  
  • జీవ పద్దతులు
      • వానలు ఎక్కువ పడే సమయం లేదా తేమ ఎక్కువగా ఉన్న సమయాల్లో పూత రాకుండా ఉండే రీతిలో సరైనా  సమయం చూసి విత్తే తేదిని నిర్ణయించుకోవాలి.
      • లవణ ద్రావణంలో విత్తనాల్ని నానబెడితే తెగులుని నివారించవచ్చు
      • తెగులు నిరోధక వంగడాలను (ఎస్.పి.వి. 191, సి.ఎస్.హెచ్ 5 వంటి రకాలు) వాడాలి

అనుకూల వాతావరణం
పూత దశ, దానికి కొన్ని వారాల ముందు ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి తెగులు ఉధృతి ఉంటుంది. 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న చల్లటి రాత్రులు 2, ౩ వారాల పాటు కొనసాగితే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 

గ్రెయిన్ మోల్డ్

 

ఇది  ఫుసేరియం, కర్వులేరియా, అస్పర్జిల్లాస్, చీటోమియం, రైజోపస్, హెల్మింతోస్పోరియం. ఫోమా అనే ఫంగస్ వల్ల వస్తుంది.  ఎక్కువగా  జొన్న పంటలో వచ్చే తెగులు ఇది.  
లక్షణాలు
ఫంగస్ ఆవరించే తీరును బట్టి గింజల మీద లక్షణాలలో తేడాలు కనపడతాయి.  పంట తొలి దశలో ఉన్నప్పుడే తెగులు సోకితే, ఇది ఎక్కువగా పువ్వు  భాగాలపై , ప్రధానంగా పువ్వుల కింద ఆకులు, పైన ఆకులపై ప్రభావం చూపుతుంది. ఈ ఆకులపై మచ్చలు  కనపడతాయి. రాను రాను ఫంగస్ మచ్చలు పువ్వులోని కణజాలానికి కూడా వ్యాపిస్తుంది.  గింజకు తెగులు సోకినప్పుడు ఆ ప్రభావం వల్ల గింజ

లోపలి భాగం గుల్లగా మారుతుంది. నల్లటి పొరలు ఏర్పడతాయి.  దీనివల్ల గింజల పరిమాణం తగ్గుతుంది. వాతావరణ పరిస్థితులను బట్టి తెగులు ఇతర గింజలకు వ్యాపిస్తుంది.  పంట మీద తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గింజల మీద గులాబి,  తెలుపు లేదా నలుపు రంగు ఫంగస్ ఏర్పడుతుంది. కారక జీవిని బట్టి  జీవ కణాల సంఖ్య ఆధారపడుతుంది. 
పెరిగిన పెరిగిన పంటకు తెగులు సోకినప్పుడు తెగులు లక్షణాలు వేరుగా ఉంటాయి. గింజ పై భాగంలో మాత్రమే ఫంగస్ ఆవరిస్తుంది. అది అంత వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆవరించిన ఫంగస్ బట్టి మచ్చల రంగు ఉంటుంది. కోతకు ముందే విత్తనం ఏర్పడితే, తెగులు తీవ్రత మరింత పెరుగుతుంది.  తేమ ఉన్నప్పుడు గింజల మీద నల్లటి పొర మాదిరి ఏర్పడుతుంది.  తెగులు సోకిన గింజలు నూర్పిడి సమయంలో నలిగిపోతాయి. కంకులు చిన్నవిగా ఉండే జొన్న రకాలలో ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువ.

మొక్కలో  పాడయ్యే భాగాలు
గింజలు, ఆకులు
తెగులు జీవిత చక్రం
తెగులుకు కారకమయ్యే ఫంగస్ పరాన్న జీవిగా ఉంటుంది. తెగులు సోకిన పంట అవషేశాలలోని కుళ్ళిన సేంద్రియ పదార్థాలలోనూ జీవించి ఉంటుంది.  పండిన గింజలు ఎక్కువ కాలం పాటు తేమలో ఉంటే ఫంగస్ గింజ లోపలి భాగాలను కూడా పాడుచేస్తుంది. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు గింజ లోపలి భాగాలలో ఫంగస్ పూర్తిగా ఆవరిస్తుంది. గింజ పై భాగాలలో ఫంగస్ ఆవరించడం సర్వ సాధారణం. ఫంగస్ ఆవరించే సమయం, లోపలికి చొచ్చుకుపోయిన తీరును బట్టి అవి పరాన్న జీవులుగానూ, పరంన్ భుక్కులుగానూ ఉండేది ఆధారపడి ఉంటుంది.
తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • విత్తన శుద్ధి – 0.౩%  థైరాంతో విత్తనాలను శుద్ధి చేయాలి.
  • కంకులు ఏర్పడే సమయంలో అప్పుడప్పుడు వానలు పడితే, వారమ తరువాత లేదా పాల దశలో, 0.25% మాన్కోజేబ్ లేదా 0.2% కాప్తాన్ లేదా లీటరు నీటికి 2 గ్రాముల కాప్తాన్, ఆరియో ఫంజి 200 పిపియం కలిపి చల్లాలి.     
  • జీవ పద్దతులు
  • సకాలంలో విత్తాలి. పరిస్థితులకు అనుగుణంగా విత్తే తేదిని నిర్ణయించుకోవాలి.
  • తెగులు నిరోధక వంగడాలను (జి.ఎం.ఆర్.పి. 4., జి.ఎం.ఆర్.పి. 9, జి.ఎం.ఆర్.పి. 1౩, సి.ఎస్.వి 15 వంటి రకాలు) వాడాలి  
అనుకూల వాతావరణం
పూత తరువాత గింజలు ఏర్పడే దశ నుంచి పంట కోత సమయమ వరకు ఎప్పుడైనా తెగులు సోకవచ్చు.

 

 గింజ తెగులు

 

ఇది స్ఫాసిలోతికా సోర్ఘీ, స్పోరి సోరియం అనే ఫంగస్ వల్ల వస్తుంది. 
లక్షణాలు

    • కంకిలో గింజ ఏర్పడే దశలో మాత్రమే కనిపించే తెగులు ఇది.
    • విడివిడిగా గింజలకు సోకుతుంది. గింజలో కొంత  భాగం లేదా మొత్తం పుష్ప భాగాలకు తెగులు సోకుతుంది.
    •  ఫంగస్ పట్టిన గింజల పైన మబ్బు పట్టిన తెలుపు లేదా బూడిద రంగులో పొరలాగా ఏర్పడుతుంది. ఇది గుండ్రటి లేదా సిలిండర్ ఆకారపు  మచ్చలతో కూడుకుని ఉంటుంది. పైన ముదురు తెల్లటి లేదా లేత గోధుమ రంగులో కవచం మాదిరి జిగట పదార్ధం ఉంటుంది. గింజలని నూర్పిడి చేసే సమయం  వరకు ఇది ఇలాగే ఉంటుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
గింజలు
తెగులు జీవిత చక్రం
విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగులు ఇది. ఫంగస్ జీవ  కణాలు గాలి ద్వారా విస్తరిస్తాయి.
తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

విత్తన శుద్ధి  - 0.5% సల్ఫర్ పౌడర్ లేదా 0.౩% థైరాం లేదా కాప్తాన్ తొ విత్తనాలను శుద్ధి చేయాలి. 

  • జీవ పద్దతులు
  • తెగులు లేని విత్తనాలు వాడాలి.
  • పంటల మార్పిడి పాటించాలి
  • తెగులు సోకిన కంకులను బట్ట బ్యాగులలో సేకరించి, మరుగుతున్న వేడి నీళ్ళలో ముంచాలి
నంద్యాల, బిలిచిగాన్ వంటి తెగులు నిరోధక వంగడాలను వాడాలి.